సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో ఇవాళ(శుక్రవారం) తెలంగాణ హైకోర్టులో జరిగే విచారణ కీలకం కానుంది. సిట్ రివిజన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ వ్యవహారంలో.. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే.
ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సిట్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. కేసు విచారించే అర్హత లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదంటూ ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి. ఈ అన్ని పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది హైకోర్టు.
రామచంద్ర భారతి విడుదల
ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో చంచల్ గూడ జైలు నుండి రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఫాంహౌజ్ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి. సుమారు 45రోజుల తర్వాత జైల్ నుండి విడుదల. వాస్తవానికి.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారమే జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే.. ఆ వెంటనే మరో కేసులో అరెస్ట్ చేశారు. దీంతో గురువారం రాత్రి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు రామచంద్ర భారతి. ఆ వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. రామచంద్ర భారతిపై ఎమ్మెల్యే ల కొనుగోలు కేసుతో పాటు మరో రెండు కేసులు. ఇదే కేసులో A3 సింహయాజులు ఇప్పటికే బెయిల్ పై విడుదల అయ్యాడు.
మరోవైపు A2 నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక A4బిఎల్ సంతోష్, A5తుషార్,A6 జగ్గు స్వామి,A7 శ్రీనివాస్ నిందితుల పై మెమో కొట్టివేసింది ఏసీబీ కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment