
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య సూచీల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కృషి చేయాలని మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య సూచీల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాల పురోగతిపై సమీక్షించి లక్ష్యాలను సాధించాలని, ఆ దిశగా సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇకపై పనితీరులో నెలవారీ వృద్ధి కనిపించాలని, అధికారుల పదోన్నతులు, ప్రోత్సాహకాలకు ఈ గణాంకాలే ప్రామాణికమన్నారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో హరీశ్‌రావు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
క్యాథ్ ల్యాబ్స్ సిద్ధం చేయాలి...
రెండు వారాల్లోగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో క్యాథ్ లాబ్స్ సిద్ధం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. అలాగే వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మంలోని క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఆన్‌లైన్ (హెచ్‌ఐఎంఎస్)లో నమోదు చేయాలని సూచించారు.
ఆసుపత్రుల్లోనే 100% ప్రసవాలు జరగాలి
ప్రసూతి మరణాలు తగ్గించడంలో దేశంలో మనం నాలుగో స్థానంలో ఉన్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి స్థానంలోకి తెలంగాణ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రస్తుతమున్న 97 శాతం నుంచి 100 శాతానికి పెంచాలన్నారు.
టీ–డయాగ్నొస్టిక్స్ దేశానికే ఆదర్శం...
పేద రోగులకు ఉచితంగా నాణ్యమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–డయాగ్నొస్టిక్స్ సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీ–డయాగ్నొస్టిక్స్ సేవలు ప్రజలకు అందుతున్న తీరును పరీశిలించేందుకు గత నెలలో బిహార్ ప్రభుత్వ అధికారులు రాష్ట్రాన్ని సందర్శించారన్నారు. వచ్చే వారం యూపీ, ఆ తర్వాత కేరళ, తమిళనాడు సైతం తమ బృందాలను రాష్ట్రానికి పంపుతున్నాయన్నారు.