సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చిన వారి వద్ద గుళ్లు, సామాజిక అవసరాలకు పార్టీలతో ప్రమేయం లేకుండా హామీలు తీసుకున్నారు.
కానీ ఓటు వేసే విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తున్నారు. తమ అంతరంగాన్ని ఎవరికీ చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఓటరు తీరు ప్రధాన రాజకీయ పార్టీల అంతరంగంలో తుఫాన్ సృష్టిస్తోంది. అయితే ప్రధాన పార్టీల ప్రలోభాల ప్రభావం ఓటర్లపై కొంతమేర ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
ఈ పార్టీల నాయకులు గెలుపును సవాల్‌గా తీసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీరోడ్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు, మంచినీటి నల్లాలు ఇలా పలు సమస్యలకు సంబంధించి ఓటర్లు.. అభ్యర్థుల నుంచి కొన్నిసాధించుకోగా, మరికొన్నింటికి హామీలు పొందారు. అయితే ఓటు వేసే విషయంలో ఎవరికి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ముందే వసూలు
సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామస్తులు ఓ పార్టీ బహిరంగ సభ కోసం వెళ్లేందుకు ఇస్తామన్న డబ్బును ముందుగానే తీసుకున్నారు. సభ కోసం వెళ్లడానికి గ్రామంలో వాహనం ఎక్కిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఇన్‌చార్జి నాయకులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గ్రామ శివారులో వాహనం ఆపి డబ్బులు ఇచ్చిన తర్వాతే సభకు బయలుదేరారు.
రెండు పార్టీల సహాయం పొందారు
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఓటర్లు మాతమ్మ గుడి అభివృద్ధికి రెండు పార్టీల సహకారం కోరారు. దీంతో ఓ పార్టీ నాయకులు దేవాలయం చుట్టూ కాంక్రీటు, దేవాలయానికి టైల్స్, ఆలయం ముందు పైకప్పుకు రేకులు వేయించారు. మరో పార్టీ.. ఆలయం ముందు భవన నిర్మాణం చేపట్టింది. రెండు పార్టీలను వాడుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు.
ఇంకా నిర్ణయించుకోలేదు
ఒక్కో అభ్యర్థి ఒక్కో రీతిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోతోంది. వాళ్లు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.
– సుర్కంటి విజయ్, ఎల్లంబావి, చౌటుప్పల్ మండలం
ఆలోచిస్తున్నాం
ఎవరికి ఓటు వేయాలన్నది ఇంకా ఆలోచిస్తున్నాం. మాకు మంచి చేసిన వాళ్లకే ఓటు వేస్తాం. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
– దోర్నాల సత్యనారాయణ, నారాయణపురం
సరైన వ్యక్తికి ఓటు వేస్తా
నాకు కొత్తగా ఓటు హక్కు లభించింది. ఇంతలోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న క్రమంలో అన్ని రకాలుగా ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేస్తాను.
– ఎండీ సోహెల్, చౌటుప్పల్
Comments
Please login to add a commentAdd a comment