ఠాణాకు వచ్చిన వృద్ధురాలు రాజవ్వ
జగిత్యాలక్రైం: ‘అయ్యా.. కంటిసూపు సరిగ్గలేదు.. కూసుంటే లేవలేను.. లేస్తే కూసోలేను.. అడుగేసి నడ్వలేను.. నా పెన్మిటి నలబై ఏండ్ల కిందనే సచ్చిపోయిండు.. గిసొంటి స్థితిలో ఉన్న నాకు కొడుకులు, కోడండ్లు బువ్వ వెడ్తలేరు.. బాంచెన్ మీజే జర నాయం జేయండ్రి’ అని జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కోడెటి రాజవ్వ(85) బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కోడెటి రాజవ్వ– మల్లయ్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు.
కూతుళ్ల వివాహలై అత్తవారింటికి వెళ్లిపోయారు. భర్త మల్లయ్య సుమారు 40ఏళ్ల క్రితమే మృతిచెందాడు. ఒక కొడుకు కూడా గతంలోనే చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇద్దరు కోడళ్లతో కలిసి రాజవ్వ ఉంటోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. కంటిచూపు సరిగాలేదు. నడవనూలేదు. దీంతో కోడళ్లు సూటిపోటిమాటలతో వృద్ధురాలిని వేధిస్తున్నారు.
కనీసం భోజనం పెట్టేందుకూ ముందుకు రావడంలేదు. విసిగి వేసారిన రాజవ్వ.. బుధవారం రూరల్ ఎస్సై అనిల్‌ను కలిసింది. తనకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంది. స్పందించిన ఎస్సై.. వెంటనే కోడళ్లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చెరో నెలరోజులు వృద్ధురాలిని పోషించాలని సూచించారు. ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చాలని పేర్కొన్నారు. వృద్ధురాలి బాగోలు ఇద్దరూ కలిసే చూడాలని ఆదేశించారు. ఇందుకు వారిద్దరూ అంగీకరించి తమ అత్తను ఇంటికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment