
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలానికి చెందిన రైతు రవికుమార్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ పాలనలో రైతు కుటుంబాల దీనస్థితికి రవికుమార్ ఆత్మహత్యే నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘పంటలకు ధర లేదు..బిడ్డలకు ఉద్యోగం లేదు.. వృద్ధులకు పింఛను లేదు. తెలంగాణ రైతుల బొందలగడ్డగా మారేంతవరకు సీఎం కేసీఆర్ స్పందించరా?’అని శుక్రవారం ట్వీట్ చేశారు.
ప్రభుత్వమే కారణం: అన్వేశ్‌రెడ్డి
రవికుమార్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు. వ్యవసాయాధికారులు గ్రామాల్లోకి వచ్చి వరి వేయవద్దని ఒత్తిడి తేవడం వల్లనే రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వంపై ఎదిరించి పోరాడాలని, ఇందుకు కిసాన్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు.