ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం కబంధ హస్తాల్లోనే మగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో సామంతరాజులు స్థానికంగా గడులు నిర్మించుకుని గడ్చిరోలి జిల్లా సిరొంచా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవారు. నాడు చెన్నూర్, ఆసిఫాబాద్, ఇందారం, తాండూర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు, గడులు, చెరువులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
తాండూర్‌లో ఠాణా భవనం
తాండూర్(ఆదిలాబాద్): నిజాం పాలనలో తాండూర్ ఓ ముఖ్య పట్టణంగా ఉండేది. ఆసిఫాబాద్–చెన్నూర్ ప్రాంతాలకు మధ్యలో, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు సమీపంలో ఉండటంతో తాండూర్‌లో పోలీస్ ఠాణాను ఏర్పాటు చేశారు. 1912–1920 మధ్యకాలంలో అక్కడ ఓ భవనాన్ని నిర్మించారు.
రెండేళ్ల క్రితం వరకు భవనాన్ని మాదారం పోలీసుస్టేషన్‌గా వినియోగించగా.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అదేవిధంగా తాండూర్‌లో పోస్టాఫీసు నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిజాం ప్రభుత్వం 1912 సంవత్సరంలో భవనం నిర్మించారు. ఇప్పడు కూడా ఈ భవనాన్ని పోస్టాఫీసుగా వినియోగిస్తుండటం విశేషం.
రెండేళ్లు అజ్ఞాతంలో..
పట్టణానికి చెందిన సాయుధ పోరాట యోధుడు సుడిగాల విశ్వనాథ సూరి రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. పోరాటయోధులను రజాకార్లు అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అధిష్టానం విశ్వనాథ సూరిని అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఆయన రెండేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. 1946లో సుభాశ్ చంద్రబోస్ అధ్వర్యంలో మహారాష్ట్రలోని సిరొంచా గ్రామంలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి హాజరయ్యారు.
అక్కడే ఏడాదిపాటు శిక్షణ పొందారు. బల్లార్ష శిబిరంలో కూడా పాల్గొన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనజీవనంలోకి వచ్చారు. 1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1952 నుంచి 1957 వరకు పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత చెన్నూర్ నియోజకవర్గాన్ని 1957లో ఎస్సీ రిజర్వు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు చెన్నూర్‌కు ప్రతినిధ్యం వహించిన స్థానికుడు కేవలం విశ్వనాథ సూరి మాత్రమే.
నస్పూర్‌లో దొరల గడి
పట్టణ పరిధిలోని ఊరు నస్పూర్‌లో సుమారు 1927–30 మధ్య కాలంలో నస్పూర్ దొరలు నిర్మించిన గడి నాటి చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలింది. నస్పూర్‌కి చెందిన గోనె రాజ వెంకట ముత్యంరావు దీనిని నిర్మించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ముత్యంరావు నాటి నిజాం ప్రభుత్వానికి నమ్మకమైన బంటుగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాలను ఈ గడి నుంచే పర్యవేక్షించేవారు.
జన్నారం, తపాలాపూర్, నస్పూర్, ఇందారం, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరొంచా గడులను కలుపుతూ ప్రత్యేక దారి ఉండేదని చెప్పుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ముత్యంరావు కుటుంబం గడిని వదిలి హైదారాబాద్‌లో స్థిరపడ్డారు. కాగా.. ఈ కుటుంబంలో నుంచి జీవీ సుధాకర్‌రావు అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.
సాయుధ పోరులో ఆసిఫాబాద్ యోధులు
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్ సమరయోధుల పాత్ర కీలకం. ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన వేలాది మంది యువకులు కాంగ్రెస్ అతివాద నాయకులతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి వెంకటేశం, చీల శంకర్, చీల విఠల్, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపెల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, జగన్నాథ్ మహారాష్ట్రలోని చాందా సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు.
వీరికి ఆసిఫాబాద్‌కు చెందిన రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబాబురావు, దండనాయకుల గోపాల్ కిషన్‌రావు, వామన్‌రావు వైరాగరే, ప్రభాకర్ రావు మసాదే సహకరిస్తూ వచ్చారు. క్యాంపు ఇన్‌చార్జీలుగా కేవీ నర్సింగరావు, కేవీ కేశవులు, వి.రాజేశ్వరరావు ఉండేవారు. మహారాష్ట్ర నుంచి సైనిక బలగాలు పది యుద్ధ ట్యాంకులు, పది ట్రక్కులు, 20 ఠానే గాఢ్‌లు, వందలాది మంది సైనికులతో చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుశిక్షితులైన పౌరులు ఆసిఫాబాద్ వైపు ముందుకు కదిలారు. నాటి పోరాటంలో పాల్గొన్న యోధులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది.
కీలక సంఘటనలు..
► 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టిన భారత సైన్యం పోలీస్ యాక్షన్ ప్రకటించింది.
►సెప్టెంబర్ 13 పొద్దుపోయాక చంద్రాపూర్, బల్లార్షా, దాభా (ఉపక్యాంపు, సిరొంచా క్యాంపుల నుంచి సాయుధ సమరయోధులు భారత సైన్యం బాటలో నిజాం పోలీసులు రజాకార్లపై విరుచుకు పడేందుకు చర్యలు ప్రారంభించారు.
► రాత్రి భారత సైన్యం హైదరాబాద్ సంస్థాన హద్దులో ప్రవేశించకుండా రాజూరా సమీపంలోని రైల్వే వంతెనకు బాంబులు అమర్చారు.
► 14న రాత్రి 11 గంటలకు రైల్వే వంతెన పేల్చివేతకు రజాకార్లు చేపట్టిన ప్రయత్నాలను సమరయోధులు గుర్తించారు. రాత్రి 12 గంటలకు ఈ విషయం కొరియర్ వ్యవస్థ ద్వారా మిలటరీకి సమాచారం అందించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విద్రోహులపై మిలటరీ దాడి, రజాకార్ల హతం, బాంబుల తొలగింపు. 3 గంటలకు మహారాష్ట్రలోని విరూర్ రైల్వేస్టేషన్‌పై ఆసిఫాబాద్‌కు సాయుధ యోధుల దాడి, ఈ ఘటనలో వెంకటేశం కాలికి గాయమైంది.
► 15 తెల్లవారుజామున 4 గంటలకు దాబా మీదుగా వచ్చిన మరో మిలటరీ క్యాంపు, సాయుధ పోరాట వీరులు పెన్‌గంగా సరిహద్దులోని లోన్‌వెల్లినాకాపై దాడితో మిలటరీ మార్గం సుగమం. రాత్రి 10 గంటలకు ఆసిఫాబాద్ సమీపంలోని బుజల్‌ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. మరునాడు స్థానికులు ఈ వంతెనపై తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు.
► 16న అర్ధరాత్రి దాటాక సిరొంచా నుంచి వచ్చిన మిలటరీ, స్థానిక సమరయోధులు బెజ్జూర్ ఔట్‌పోస్టుపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున సాయుధ పోరాటయోధులు దహెగాం సమీపంలో పెసరకుంట వద్ద రజాకార్లపై దాడి చేశారు. ఈ సంఘటనలో 19 మంది మృతి చెందారు. అనంతరం బీబ్రా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
► ఇదేరోజు ఆసిఫాబాద్ జిల్లా జైలులో పదుల సంఖ్యలో సమరయోధులను నిర్భందించారు. 17న నిజాం లొంగుబాటు వార్తతో ఆసిఫాబాద్ జైళ్లోని సమరయోధులు ఇతర ఖైదీలతోపాటు బయటికి వచ్చారు.
చదవండి: నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment