సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల ఆరో తేదీ నుంచి మొదలు కానుంది. ఉన్నత విద్యా మండలి మంగళవారం ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సారి కౌన్సెలింగ్‌లో హైకోర్టు అనుమతి ద్వారా వచ్చిన 5,770 కొత్త సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. వీటిని అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెరిగే సీట్లలో 5,610 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ బ్రాంచుల్లో ఉన్నాయి. 160 ఫార్మసీ సీట్లను పెంచారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే, తొలి దశలో 78,270 సీట్లను భర్తీ చేశారు. ఇందులో 61,169 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 46,322 సీట్లు మిగిలిపోయాయి. గత నెలాఖరులో జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు కూడా ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో సీట్లు పొందే వీలుంది. ఫలితంగా మరికొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. మొదటి దశ కౌన్సెలింగ్‌లో పొందిన సీటును వదులుకోడానికి ఈ నెల 5వ తేదీ చివరి గడువు పెట్టారు. మిగిలిన సీట్లపై 6వ తేదీన స్పష్టత వస్తుంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు..
కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యే సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు కోసం రూ.73,50,92,604 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోపక్క జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తోంది. కాగా, డిమాండ్ లేని కోర్సుల్లో కొన్ని సీట్లను పలు కాలేజీలు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో సీఎస్‌ఈ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్ల పెంపునకు చేసుకున్న దరఖాస్తులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా వచ్చే కోర్సుల్లో 70 శాతం కన్వీనర్ కోటా ద్వారా, 30 శాతం యాజమాన్య కోటా ద్వారా భర్తీ చేస్తారు. రెండో దశ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత వెంటనే ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు కౌన్సిల్ వెల్లడించింది.
Telangana: 6 నుంచి ఎంసెట్ రెండో విడత
Published Wed, Nov 3 2021 2:30 AM | Last Updated on Wed, Nov 3 2021 2:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment