సాక్షి, హైదరాబాద్: కొత్త సీట్లు వచ్చాయి.. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో కేటాయించిన సీట్లు ఖాళీ అవుతున్నాయి.. రెండో కౌన్సెలింగ్‌లో కోరుకున్న కాలేజీలో, కోరుకున్న సీటు గ్యారెంటీ అని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. అయితే ఈ కౌన్సెలింగ్‌ను అంత తేలికగా తీసుకోవద్దని సాంకేతిక విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మొదటి కౌన్సెలింగ్ కన్నా, ఈ సారి మరింత ఎక్సర్‌సైజ్ చేయాలని సూచిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెల 6 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలవుతుంది. 9వ తేదీ వరకు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కోర్సుకు ప్రాధాన్యమా..? కాలేజీకా అన్న విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్ ట్రెండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు.
అంత కష్టమేం కాదు
‘రెండో కౌన్సెలింగ్‌పై కాస్త కసరత్తు చేస్తే మంచి కాలేజీలో సీటు పొందే వీలుంది. ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిరుచే కాదు.. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా బ్రాంచ్ ఎంచుకోవాలి. కోరుకున్న స్థాయిలో ర్యాంకు లేనప్పుడు మాత్రమే రెండో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. మొదటి కౌన్సెలింగ్ కన్నా రెండో కౌన్సెలింగే కీలకమని గుర్తించాలి.
–తుమ్మల పాపిరెడ్డి,ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్
వీటిని పరిశీలించాలి
- మొదటి కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీలో ఎంత ర్యాంకు వరకు ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చింది? ఈ వివరాలన్నీ ఎంసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మీకు 12 వేల ర్యాంకు వచ్చి ఉండొచ్చు. మీరు దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆ కాలేజీలో సీఎస్‌ఈ సీటు 13 వేల ర్యాంకు వచ్చిన వారికి రావొచ్చు. ఆ ర్యాంకు వచ్చిన వ్యక్తికి అంతకన్నా మంచి కాలేజీలో సీటు వస్తుందా? లేదా అనేది పరిశీలించాలి. ఆ వ్యక్తికి సీటు రాకపోతే కాలేజీ మారే అవకాశం లేదని గుర్తించాలి.
- మొదటి 5 వేల ర్యాంకుల వరకు చాలామేర మార్పుచేర్పులు ఉండొచ్చు. జాతీయ కాలేజీల్లో సీట్లు వచ్చిన వారు ఈ ర్యాంకుల్లోనే ఉంటారు. కాబట్టి ఈ సీట్లు ఖాళీ అయితే మీకే వస్తాయని మొదటి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. ఎందు కంటే తర్వాత ర్యాంకులో వేరే బ్రాంచ్‌లో సీటు వచ్చిన వారు కూడా మీరు కోరుకునే బ్రాంచ్‌లోకి రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పడే వీలుంది.
- మీకు వచ్చే ర్యాంకును బట్టి అటు ఇటుగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. మంచి కాలేజీగా భావిస్తే మొదటి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అదికూడా మీ ర్యాంకుకు దగ్గర్లో ఉంటేనే.. బ్రాంచ్ విషయంలోనూ ముందుగా ఫస్ట్ కౌన్సెలింగ్ జాబితాతో పాటు, గత రెండేళ్లు కాలేజీ ర్యాంకును పరిశీలించి ఆప్షన్ ఎంచుకోవాలి.
కొత్త సీట్ల విషయంలో జాగ్రత్త
టాప్ టెన్ కాలేజీల్లోనే ఈసారి కంప్యూటర్, దాని అనుబంధ బ్రాంచీల సీట్లు పెరిగాయి. ఇతర కాలేజీల్లో ఉన్న వారు టాప్‌టెన్ కాలేజీల్లో కంప్యూటర్ కోర్సుల్లోకి ప్రయత్నించే వీలుంది. కాబట్టి మీ ర్యాంకు సమీపంలో ఉన్న కాలేజీలను ఎంచుకుంటే సీటు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కాలేజీల్లో పూర్తిగా పెద్ద మొత్తంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ సీట్లు పెరిగాయి. కాబట్టి ఏయే ర్యాంకుల వారికి ఆ కాలేజీ లో సీటు వచ్చే వీలుందనేది ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ల ఎంపిక ఆధారంగా గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment