సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలంతా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసి న వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోటీ చేయా లనే ఆలోచనలోనే ఉన్నారు. ఈ మేరకు తమ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు పరిస్థితులను చక్కబెట్టుకుంటున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలతో పాటు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఫలితాలు తమకు సానుకూలంగా వస్తాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారనే ఆలోచనతోనే వీరంతా అసెంబ్లీ వైపు మొగ్గుచూపుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మధిరలో ‘పట్టు వదలని విక్రమార్కుడు’
నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా, రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా తెచ్చుకునే ప్రయత్నాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే ఆయన మూడు విడతలుగా నియోజకవర్గంలో పర్యటించారు. ‘పీపుల్స్ మార్చ్’పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాల్లో 400 కిలోమీటర్ల మేర 86 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఎర్రుపాలెం మండలం మినహా నియోజకవర్గంలో ని మిగిలిన మండలాల్లో ఆయన గ్రామగ్రామానికి వెళ్లి ఓ వైపు ప్రజాసమస్యలను తెలుసుకోవడం, తా ను చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేసే ప్రయత్నం చేశారు.
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ స్పీడు
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ బాట పడుతున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించడమే ధ్యేయంగా ఈ నెల 21 నుంచి ఆయన యాత్ర చేపట్టారు. టీపీసీసీ పిలుపులో భాగంగా పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో గత ఐదురోజుల్లోనే 40 గ్రామాల్లో పర్యటించారు. ఎండను లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైతు రచ్చబండలు, సభల్లో పాల్గొంటున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించడంతో పాటు నియోజకవర్గంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ ప్రజల సమస్యలను వారికి వివరిస్తున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కేడర్‌తో కూడా సమావేశమవుతున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలతో వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం పంపించడం, కార్యక్రమాలు విజయవంతం చేసేలా పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేయడం కోసం ఈ గ్రూపులను ఉపయోగించుకో వాలనేది ఉత్తమ్ ఆలోచనగా చెబుతున్నారు.
శివారు నియోజకవర్గంపై యాష్కీ కన్ను
ఇక గతంలో నిజామాబాద్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఈసారి హైదరాబాద్ శివార్లలోని ఓ అసెం బ్లీ నియోజకవర్గంపై కన్నేసినట్టు చర్చ జరుగుతోంది. తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానంపై ఆయన గురిపెట్టారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి ఎప్పటిలాగే జగిత్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరితో పాటు ఇప్పటికే అసెంబ్లీ ఇన్‌చార్జులుగా ఉన్నవారు, గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన నాయకులు పలువురు కూడా వరంగల్ డిక్లరేషన్ పేరుతో గ్రామాల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో పట్టు సాధించే లక్ష్యంతో తమ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
నల్లగొండ నుంచి ఖాయమన్న కోమటిరెడ్డి...
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయానికొస్తే.. తాను వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తాన ని ఆయన ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment