
ఒప్పంద పత్రాలను చూపిస్తున్న టీహబ్ సీఈవో ఎంఎస్‌రావు, హెచ్‌ఏఎల్ డైరెక్టర్ డీకే సునీల్
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో కలిసి టీ–హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా వైమానిక, రక్షణ రంగాల మార్కెట్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
స్టాటిస్టా సంస్థ నివేదిక ప్రకారం 2021 నుంచి 2027 మధ్య వైమానిక, రక్షణ రంగాల మార్కెట్ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 13.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టీ–హబ్, హెచ్‌ఏఎల్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను అందుకునేదిశగా.. స్టార్టప్‌లకు అవసరమైన నైపుణ్యం, వనరులు, మార్కెట్‌తో అనుసంధానం, ఆవిష్కరణల కోసం అవసరమయ్యే సాయాన్ని టీహబ్, హెచ్‌ఏఎల్ సంయుక్తంగా సమకూరుస్తాయి. స్టార్టప్‌ల ఆవిష్కరణలకు రూపం ఇచ్చేందుకు ఏరోస్పేస్ రంగ నిపుణుల తోడ్పాటు ఇప్పించేందుకు హెచ్‌ఏఎల్ చర్యలు చేపడుతుంది. స్టార్టప్‌లకు అవసరమయ్యే మార్గదర్శనం, శిక్షణ, విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను టీ–హబ్ సమకూరుస్తుంది.
ఏరో స్పేస్ రంగంలో కొత్త అవకాశాలు: టీ–హబ్ సీఈఓ ఎంఎస్‌ఆర్
ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు హెచ్‌ఏఎల్‌తో తమ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. టీ–హబ్ వనరులు, హెచ్‌ఏఎల్ నైపుణ్యాల కలబోతతో స్టార్టప్‌ల ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో బలంగా ఉన్న ఆవిష్కరణల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్‌లను సరైన దిశలో నడిపేందుకు టీ–హబ్‌తో తమ భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలుస్తుందని హెచ్‌ఏఎల్ (ఇంజనీరింగ్, పరిశోధన అభివృద్ధి) డైరక్టర్ డీకే సునీల్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్రణాళికలో భాగంగా పన్నులు పోగా మిగిలే హెచ్‌ఏఎల్ లాభాల్లో 2 శాతాన్ని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌ల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టీ–హబ్ ఇప్పటికే అనేక విజయాలు సాధించిందని వివరించారు.