సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం 29వ రాష్ట్రంగా ఉద్భవించిన తెలంగాణ పర్యాటక రంగంలో క్రమక్రమంగా పుంజుకుంటోంది. ప్రసిద్ధ దేవాలయంగా, పర్యాటక కేంద్రంగా యాదాద్రి టెంపుల్ రూపుదిద్దుకుంటున్న క్రమంలో రాబోయే రోజుల్లో దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్‌లో అతిపెద్ద బౌద్ధ కేంద్రం అన్ని హంగులు సంతరించుకుని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విలసిల్లడానికి సంసిద్ధమవుతోంది. ఇటు రాష్ట్రం నలుమూలాల ఉన్న గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు వివిధ టూరిస్ట్ సర్క్యూట్లు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ హెరిటేజ్ సర్క్యూట్ పేరిట ప్రతిష్టాత్మకంగా టూరిజం ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ట్రైబల్ టూరిజం సర్క్యూట్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎకో టూరిజం, ఆదిలాబాద్ నిర్మల్, కొమురంభీం–ఆసిఫాబాద్ జిల్లాల్లో ట్రైబల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2019లోని పర్యాటకరంగ పరిస్థితిని ఒకసారి అవలోకిద్దాం...
నిజామాబాద్ జిల్లాకు ఒకే విదేశీ టూరిస్ట్
తెలంగాణలో మూడోవంతు జనాభా పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తుండగా అందులో సింహభాగం రాజధాని హైదరాబాద్‌లోనే నివసిస్తున్న విషయం తెలిసిందే. అయితే పర్యాటక పరంగా చూస్తే.. 2019లో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 8.33 కోట్ల 59 వేల మంది సందర్శించినట్లు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. వారిలో అత్యధిక శాతం అంటే 99.6 శాతం దేశీయ టూరిస్ట్‌లు కాగా, 0.4 శాతం అంటే 3,23,326 మంది మాత్రమే విదేశీ పర్యాటకులున్నారు. విదేశీ టూరిస్ట్‌లు ఎక్కువగా అంటే 3.19 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే పర్యటించారు. ప్రధానమైన ఈ నాలుగు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాకు 2,450 మంది విదేశీ పర్యాటకులు విచ్చేశారు. ఆ తర్వాత ములుగు, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వందల సంఖ్యలో, జయశంకర్ జిల్లాలో 45 మంది, మంచిర్యాలలో 10 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, నారాయణపేట జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్‌లో ఒకే ఒక విదేశీ టూరిస్ట్ పర్యటించడం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల టాప్!
జిల్లాల్లో పర్యాటక కేంద్రాల విషయానికొస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా అత్యధికంగా స్థానిక, దేశీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలోనే టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. మొత్తం దేశీయ పర్యాటకులు 8.30 కోట్లకు గానూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 1.68 కోట్ల మంది పర్యటించారు. ఆ తర్వాతి స్థానంలో రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కలున్న నాలుగు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ) జిల్లాల్లో 1.38 కోట్ల మంది పర్యాటకులు, ఆ తర్వాతి స్థానంలో 1.28 కోట్ల మంది టూరిస్ట్‌లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. ఇక 55 లక్షల నుంచి 15 లక్షల లోపు మంది పర్యాటకులు పర్యటించిన జిల్లాల్లో మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ, ములుగు, వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 7.76 లక్షల మంది పర్యాటకులు, జయశంకర్ జిల్లాలో 6.62 లక్షలు, ఇక నారాయణపేట జిల్లాలో 3.89 లక్షల మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 3.53 లక్షల మంది, జనగామ, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలకు 3.28 లక్షలు మొదలుకుని 1.41 లక్షల మధ్యలో పర్యటించారు. కరీంనగర్, నిజామాబాద్, కొమురం భీం, పెద్దపల్లి జిల్లాల్లో 77,491 మొదలుకుని 16,581 మంది మధ్యలో పర్యటించారు. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 534 మంది పర్యాటకులు విచ్చేశారు. అయితే ఒక్కసూర్యాపేట జిల్లా పర్యాటకుల గణాంకాలను నివేదికలో చూపలేదు.
టూరిజానికి కేరాఫ్ తెలంగాణ!
Published Sat, Oct 31 2020 9:05 AM | Last Updated on Sat, Oct 31 2020 9:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment