సాక్షి, ఆదిలాబాద్: మహాశివరాత్రి దాటితే వేసవి ఎండలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. కానీ ఈసారి శివరాత్రి కంటే ముందే ఎండకాలం మొదలైనట్లు వాతావరణం కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రివేళ చలి తీవ్రత సైతం కొనసాగుతోంది. భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పల్లెల్లో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతం అవుతున్నారు.
తగ్గని చలి..
ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండగా, చలి మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే ఉంటున్నాయి. గురువారం తెల్లవారు జామున సిర్పూర్(యూ)లో 9.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, బజార్‌హత్నూర్(ఆదిలాబాద్) 9.8, బేల(ఆదిలాబాద్)లో 10.3, కవ్వాల్ టైగర్ రిజర్వు జన్నారం(మంచిర్యాల)లో 10.5, బోరజ్(ఆదిలాబాద్)లో 10.6, కెరమెరి(కుమురంభీం)10.9, వాంకిడి(కుమురంభీం) 10.9, జైనథ్(ఆదిలాబాద్) 11.2, ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు(ఆదిలాబాద్) 11.3, నేరడిగొండ(ఆదిలాబాద్) 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
మండుతున్న ఎండలు..
సాధారణంగా మార్చి నుంచి ఎండల తీవ్రత కనిపిస్తుంది. ప్రస్తుతం చలితోపాటు మండుతున్న ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను తిప్పలు పెడుతున్నాయి. పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. తాజాగా కుమురంభీం జిల్లా బెజ్జూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. అసాధారణ వాతావరణ పరిస్థితులతో రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లోనూ వైరల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ప్రజలు బాధపడుతున్నారు. తీవ్రత అధికంగా ఉన్నవారు నిర్లక్ష్యం చేయొద్దని, తప్పనిసరిగా ఆస్పత్రుల్లో సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యులను సంప్రదించాలి
వాతావరణ మార్పులతో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మంచు కురిసే సమయాల్లో ఎక్కువగా బయట తిరుగొద్దు. దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– నవత, వైద్యురాలు, కౌటాల
వారం రోజులుగా రోగుల తాకిడి
వారం రోజులుగా జిల్లాలోని ప్రభు త్వ ఆస్పత్రులకు 60శాతం రోగుల తాకిడి పెరిగింది. ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు సమయం పడుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
– ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో, కుమురంభీం
Comments
Please login to add a commentAdd a comment