సాక్షి హైదరాబాద్: కరోనా ప్రభావంతో మూడేళ్ల తర్వాత పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల షెడ్యూలు విడుదల కావడంతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రక్రియ ప్రారంభించారు. సర్కారు బడుల్లో మాత్రం సిలబస్ పూర్తి కాలేదు. మరోవైపు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీసం ఉత్తీర్ణత మార్కులతో గట్టెక్కేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు..
కరోనా నేపథ్యంలో 2021– 22 విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్‌తోనే పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపే సిలబస్ పూర్తిచేయాల్సి ఉండగా సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత కరోనా థర్డ్‌వేతో సర్కారు బడుల్లో సిలబస్ పెండింగ్‌లో పడిపోయింది. సైన్స్, మ్యాథ్స్ మినహా మిగిలిన సబ్జెక్టుల సిలబస్ దాదాపు పూర్తి కావచ్చిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏడో తరగతి తర్వాత..
కరోనా కంటే ముందు ఏడో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులంతా తాజాగా టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 2018– 19లో 7వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆ తర్వాత కరోనా ఎఫెక్టుతో 8, 9 పరీక్షలు రాయకుండానే ప్రమోట్ అయ్యారు. కరోనా నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో టెన్త్ విద్యార్థులు సైతం వార్షిక పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. తాజాగా పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
సర్కారు బడుల్లో అంతంతే...
సర్కారు బడుల్లో పదో తరగతి వార్షిక పరీక్షపై ప్రత్యేక శ్రద్ధ అంతంత మాత్రంగా తయారైంది. గతంలో ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసి పరీక్షలకు సమాయత్తం చేసేలా చర్యలు చేపట్టేవారు. ఈసారి మాత్రం మౌఖిక ఆదేశాలు ఆచరణలో అమలు లేకుండా పోయింది. ప్రతి రోజు అదనంగా ఉదయం గంట, సాయంత్రం గంట ప్రత్యేక తరగతుల నిర్వహిస్తే తప్ప సిలబస్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవంగా సబ్జెక్టు టీచర్ల కొరత కూడా వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment