బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. షెడ్యూల్‌ ఇదే | Third Phase Of Praja Sangrama Yatra Will Start From August 2 | Sakshi
Sakshi News home page

యాద్రాది నుంచి బండి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. కేంద్ర మంత్రుల రాక 

Published Tue, Aug 2 2022 3:11 AM | Last Updated on Tue, Aug 2 2022 3:40 PM

Third Phase Of Praja Sangrama Yatra Will Start From August 2 - Sakshi

సాక్షి, యాదాద్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ మూడవ విడత ప్రజా సంగ్రామయాత్ర మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో జరిగే ప్రారంభసభకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. సంజయ్‌ ఉదయం 10 గంటలకు యాదాద్రికి చేరుకుని కేంద్రమంత్రులతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామికి పూజలు చేస్తారు.

11 గంటలకు యాదగిరిపల్లి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగసభ అనంతరం కేంద్ర మంత్రి షెకావత్‌ పార్టీ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు. మూడో విడత పాదయాత్ర 24 రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి నుంచి జనగామ జిల్లా మీదుగా వరంగల్‌కు చేరుకుంటుంది. వరంగల్‌లోని భద్రకాళిని దర్శించుకుని యాత్రను ముగిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. 

తొలిరోజు పాదయాత్ర ఇలా..
తొలిరోజు బండి సంజయ్‌ 10.5 కి.మీ. మేర పాదయాత్ర చేస్తారు. యాదగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మీదుగా గణేష్‌నగర్‌ నుంచి శుభం గార్డెన్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, తిరిగి పాతగుట్ట, గొల్లగుడిసెలు మీదుగా దాతారుపల్లికి పాదయాత్రగా వెళ్తారు. దాతారుపల్లిలో జెండావిష్కరణ చేసి, అక్కడి నుంచి బస్వాపూర్‌ సమీపంలో రాత్రి బస చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా, యాదాద్రి నుంచి ప్రారంభమయ్యే ప్రజా సంగ్రామయాత్రకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. యాదగిరిపల్లిలో నిర్వహించే బహిరంగసభ స్థలంలో సోమవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీవీఎస్‌ ప్రభాకర్, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ పూజలు చేశారు. అనంతరం వేదిక పనులు చేపట్టారు. బండి సంజయ్‌తో పాటు  రాష్ట్ర నాయకులు, యాత్ర ప్రముఖులు వంద కూర్చునేలా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అవును నేను రాజకీయ ఉన్మాదినే.. మరి మీరేంటి: బండి సంజయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement