సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అరెస్టు చేసింది. వీళ్లు ఏఈఈ, డీఏఓ పరీక్ష పత్రాలు ఖరీదు చేసిన అభ్యర్థులని అధికారులు ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 30కి చేరింది. కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌కుమార్ నుంచి ఏఈఈ పేపర్లు వరంగల్, హైదరాబాద్‌లకు చెందిన దళారులు మనోజ్‌కుమార్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డిలకు చేరాయి. వీటిని ఏడుగురికి విక్రయించారు.
ఒక్కోక్కరితో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు అడ్వాన్సులు తీసుకుని పేపర్లు అందించారు. మనోజ్, మురళీ విచారణలో వీరి నుంచి పేపర్లు ఖరీదు చేసిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత వారం నలుగురిని అరెస్టు చేసిన సిట్ మంగళవారం క్రాంతి, శశిధర్‌రెడ్డిలను పట్టుకుంది. ఈ ద్వయం మురళీధర్‌రెడ్డి నుంచి ఏఈఈ పేపర్లు ఖరీదు చేసినట్లు గుర్తించింది.
మరోపక్క ప్రవీణ్ కుమార్ రూ.6లక్షలు తీసుకుని ఖమ్మంకి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్‌లకు డీఏఓ పేపర్ విక్రయించాడు. వీరిని సిట్ అధికారులు గత నెలలోనే అరెస్టు చేశారు. సాయి లౌకిక్ ఆ పేపర్‌ను తన స్నేహితుడైన రవి తేజకు విక్రయించాడు. దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన పోలీసులు మంగళవారం రవితేజను కటకటాల్లోకి పంపారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది.
పేపర్ లీకేజీపై ఈడీకి బీఎస్‌పీ ఫిర్యాదు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలైన సూత్రధారులను అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాసిన లేఖను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, అరుణ, సంజయ్‌లు ఈడీ కార్యాలయంలో సంబంధిత అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment