ఖమ్మంరూరల్: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు.
అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది.
దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment