సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు.
మంగళవారం గాంధీ భవన్‌లో మాజీ ఎంపీ మల్లురవి, టీపీసీసీ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయా కర్, కల్వ సుజాత, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోరాటం చేస్తుంటే.. కేసులు పెడుతూ, దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క కాం గ్రెస్ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదని, వారి రక్షణ కోసం గాంధీ భవన్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం టీఆర్‌ఎస్‌కు అలవాటుగా మారిందని మల్లు రవి, దయాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రోడ్లపై తిరగలేరన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
పరువు పోగొట్టుకున్నారు
కోర్టులో పరువునష్టం దావా వేసి మంత్రి కేటీఆర్ తన పరువు పోగొట్టుకున్నారని మల్లు రవి ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్‌ను కేటీఆర్ ఇప్పటికైనా స్వీకరించాలని అన్నారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మల్‌రెడ్డి ఆరోపించారు.
భౌతిక దాడులు సరికాదు
జగిత్యాలటౌన్: మాదక ద్రవ్యాల కేసులో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టీఆర్‌ఎస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిపై భౌతికదాడులకు దిగడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌కు సినీ పరిశ్రమతో ఉన్న లోపాయికారి సంబంధాలే మాదకద్రవ్యాల కేసు విచారణకు అడ్డంకిగా మారాయని ఆరోపించారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేటీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. జగిత్యాలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ సభలో రేవంత్ ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తే ఆయనపై కేసులు పెట్టడం ప్రభుత్వ నియంతృత్వధోరణికి అద్దం పడుతోందన్నారు. డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించేందుకే రాహుల్ పేరు ను కేటీఆర్ ముందుకు తెస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment