పార్క్ హయత్‌లో సమావేశమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు అను గుణంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులకు పార్టీ, రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని అధిష్టానాన్ని కోరేందుకు ఢిల్లీ వెళ్లాలని పలువురు కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలిసి సామాజిక సమతుల్యత అనివార్యతను వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో సమావేశమయ్యారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఆలోచనావిధానం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వివిధ పార్టీల బలాబలాల గురించి కూడా చర్చ జరిగింది.
చర్చ అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని, అన్ని విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశానికి పార్టీనేతలు అద్దంకి దయాకర్, గోమాస శ్రీనివాస్, రాములునాయక్, జనక్‌ప్రసాద్, కత్తి వెంకటస్వామి, చందా లింగయ్యదొర, నరేశ్ జాదవ్, రియాజ్ అహ్మద్, భరత్ చౌహాన్, ఈర్ల కొమురయ్య, జమునా రాథోడ్, కె.వి.ప్రతాప్, లక్ష్మయ్య యాదవ్, ప్రతాప్‌సింగ్, సాజిద్‌ఖాన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో చేసిన తీర్మానాలివే...
►రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఎజెండాపై చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడిని కలవాలి.
►ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గేను హైదరాబాద్‌కు తీసుకువచ్చి సన్మానం చేయాలి.
►సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమనే భరోసా ప్రజల్లో కల్పించేందుకు ఆయా సామాజికవర్గాల ముఖ్యనేతలతో కలిసి జిల్లాల్లో పర్యటించాలి.
►రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఇతర వర్గాల నేతల ఆధిపత్యాన్ని సహించేది లేదు. ఇతరపార్టీల నేత లు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నాయకుల వైఖరిలో మార్పు తీసుకురావాలి.
►ఉమ్మడి జిల్లాలవారీగా బహిరంగసభలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చించాలి. నియోజకవర్గాలవారీగా సామాజిక న్యాయ సమావేశాలు ఏర్పాటు చేయాలి. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలి.
►రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇప్పించే ప్రయత్నాలు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment