సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు.
ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఆయా సమయాల్లో సాధారణ వాహనచోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు.
గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు.
నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు.
జమాతుల్ విదా ప్రార్థనల నేపథ్యంలో...
శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్–మదీన, చార్మినార్–ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్–శాలిబండ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని మదీన జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తారు.
ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో (ఇక్కడ కేవలం విధుల్లో ఉన్న అధికారుల వాహనాలు) పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే ప్రార్థనల నేపథ్యంలో మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
(చదవండి: ట్విట్టర్‌లో పెట్రో వార్ !)
Comments
Please login to add a commentAdd a comment