Friday prayers
-
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారం అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు సంస్థల దగ్గర భద్రతను పెంచారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీల భద్రతను కాపాడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అనంతరం భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం -
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఆయా సమయాల్లో సాధారణ వాహనచోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. జమాతుల్ విదా ప్రార్థనల నేపథ్యంలో... శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్–మదీన, చార్మినార్–ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్–శాలిబండ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని మదీన జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో (ఇక్కడ కేవలం విధుల్లో ఉన్న అధికారుల వాహనాలు) పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే ప్రార్థనల నేపథ్యంలో మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: ట్విట్టర్లో పెట్రో వార్ !) -
మసీదులో పేలుడు: 12 మంది మృతి
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కాబుల్ సమీపంలోని ఓ మసీదులోశుక్రవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా, మరో 15 పైగా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాజధాని షకర్ దారా జిల్లాలోని జరిగిన ఈ పేలుడులో మసీదు ఇమామ్ ఉన్నట్లు కాబూల్ పోలీసు ప్రతినిధి ఫెర్డస్ ఫరామార్జ్ తెలిపారు. వారం రోజుల కిందట ఒక పాఠశాల వద్ద జరిగిన పేలుడులో 80 మంది మరణించిన ఘటన మరవకముందే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. రంజాన్ ప్రార్థనలు జరగడానికి ముందే.. మసీదులో పేలుడు పదార్ధాలను అమర్చినట్లు పోలీసుల ప్రతినిధి ఫెర్‌దావస్ ఫరమార్జ్ తెలిపారు. ప్రార్థనలు ప్రారంభమైన కొద్ది సమయానికే బాంబు పేలిందని, అయితే దీనిపై ఏ తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మసీదు నుంచి పెద్ద శబ్దం వచ్చింది. కళ్లముందే ధ్వంసమైంది. పెద్దల, పిల్లల అరుపులు, ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్తుంటే చాలా మంది రక్తపు మడుగులో కనిపించారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు చనిపోయారని’ తెలిపారు. ఈ పెలుడు పై విచారణ మొదలుపెట్టినట్లు కాబూల్ పోలీసులు తెలిపారు. ( చదవండి: 500 రాకెట్ల దాడిని అడ్డుకున్న ‘ఐరన్ డోమ్’ ) -
జమ్మూకశ్మీర్ గవర్నర్ కీలక ముందడుగు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లధాఖ్ విభజన తదితర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అనంతరం భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయిన కశ్మీర్ లోయలో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ఆంక్షలు ఎత్తివేసి.. పాఠశాలలను తెరిచిన సంగతి తెలిసిందే. రోడ్ల మీద జనజీవన సంచారం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కీలక ముందడుగు వేశారు. ప్రజలు తమ సమస్యలు నేరుగా ప్రభుత్వ యంత్రాంగానికి విన్నవించుకొనే అవకాశం కల్పించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఒకరోజు ముందు గురువారం గవర్నర్ సలహాదారు కేకే శర్మ స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారని, శ్రీనగర్‌లోని గవర్నర్ గ్రీవెన్స్ సెల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన నేరుగా ప్రజల సమస్యలు వింటారని, ప్రజలు ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు, ఇబ్బందులు ఉంటే ఈ కార్యక్రమంలో తెలియజేయాలని జమ్మూకశ్మీర్ సమాచార శాఖ తెలిపింది. ప్రస్తుతం గవర్నర్ తర్వాత అత్యంత కీలకమైన ప్రభుత్వ హోదాలో ఆయన సలహాదారు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
రేపు కశ్మీర్లో ఆంక్షల సడలింపు..!
శ్రీనగర్/న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కేంద్రం నిర్ణయాల అనంతరం భద్రతా బలగాల నీడలో ఉన్న కశ్మీర్లో పెద్దగా అలజడులు చెలరేగలేదు. చిన్నాచితక ఘటనలు మినహా ఆందోళనలు అంతగా చోటుచేసుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముస్లిం ప్రజల ప్రార్థనల సందర్భంగా కేంద్రం భద్రతా ఆంక్షలను సడలించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సోమవారం బక్రీద్ ఉండటంతో ఆ రోజు కూడా నిషేధాజ్ఞలను సడలించి.. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 12న ముస్లిం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా లోయలో 144 సెక్షన్ ఎత్తివేతతోపాటు ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించే అవకాశముంది. లోయలోని పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భద్రతా బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బందోబస్తును పర్యవేక్షించడంతోపాటు కశ్మీర్ విషయంలో కేంద్రం తాజా నిర్ణయాలపై స్థానికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి భోజనం చేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దును స్థానికులు స్వాగతిస్తున్నారని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. -
‘తాజ్’లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి
న్యూఢిల్లీ: తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల వారు ఆగ్రాలో ప్రార్థనలు చేసుకోవడానికి వేరే మసీదులు ఎన్నో ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది. -
ఈ ఆటోవాలా గొప్పతనమెంటో తెలుసా?
సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు. సినిమాల్లో కనిపించినట్టు చిత్రవిచిత్రమైన దుస్తులు వేసుకొని విన్యాసాలు చేయరు. నిజమైన సూపర్ హీరోలు సామాన్య ప్రజల్లోనే ఉంటారు. అలాంటి ఒక సూపర్ హీరో ఆటోవాలా రూపంలో ముంబై వాసి అయిన రమీజ్ షైఖ్కు ఎదురయ్యాడు. అతని హృదయాన్ని గెలుచుకున్నాడు. మత సామరస్యం, మానవత్వంతో హృదయాన్ని పరిమళింపజేసిన ఆ అనుభవం గురించి రమీజ్ షైఖ్ ఈ నెల 26న ఫేస్బుక్లో వివరించాడు. ఈ ఘటన నెటిజన్లను కదిలించింది. వారితో జేజేలు కొట్టించింది. ఏకంగా ఎనిమిదివేల మందికిపైగా ఈ పోస్టును షేర్ చేసుకున్నారు. ఇంతకు ఆ రోజు ఏం జరిగిందంటే.. రమీష్ షేఖ్ మాటల్లోనే.. శుక్రవారం కావడంతో నమాజ్ కు హాజరయ్యేందుకు మధ్యాహ్నం 1.40 గంటలకు నేను హడావిడిగా ఆఫీసు నుంచి పరిగెత్తుకొచ్చాను. ఆటోలో ఎక్కిన తర్వాత తెలిసింది హడావిడిలో నేను నా పర్సును ఆఫీసులోనే మరిచిపోయిన విషయం. దీంతో నన్ను మసీదు వద్ద డ్రాప్ చేసి 10-15 నిమిషాలు ఆగమని, ఆ తర్వాత తిరిగి ఆఫీసు దగ్గర దిగబెడితే.. మీటర్ చార్జీ కన్నా ఎక్కువే ఇస్తానని ఆటో డ్రైవర్‌కు చెప్పాను. అతని ఆటో ముందు అద్దంపై గణపతి ఉత్సవ స్టిక్కర్ అంటించి ఉంది. అతను మాత్రం 'భగవంతుని పనిమీద వెళుతున్నారు. మీరు టెన్షన్ పడకండి. నేను మిమ్మల్ని తీసుకెళుతాను. కానీ మీరు వచ్చేవరకు నేను ఆగలేను. నాకు వెళ్లాల్సిన పని ఉంది' అని చెప్పాడు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. ఆయన ఒప్పుకోకపోయి ఉంటే నేను ప్రార్థనను మిస్ అయ్యేవాడిని. మసీదు వద్ద నన్ను దింపేసిన తర్వాత ఆయన నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనివిధంగా మానవత్వాన్ని చూపారు. తన జేబులోంచి డబ్బులు తీసి నా చేతిలో పెట్టారు. నమాజ్ ముగిసిన తర్వాత ఈ డబ్బుతో తిరిగి ఆఫీసుకు వెళ్లమని చెప్పారు. నా కోసం ఆయన వేచి ఉండలేరు కాబట్టి నేను ఏ ఇబ్బంది పడకుండా తిరిగి ఆఫీసుకు వెళ్లేందుకు సైతం ఆయన ఆలోచించారు. అందుకు డబ్బులు ఇచ్చారు. ఇలా జరిగినందుకు ఏం చికాకుపడకు అని కూడా ఆయన నాకు చెప్పారు. దీంతో ఆయనకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియలేదు. ఆయనే శుక్లాజీ. (ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి). ఒక ఆటోవాలా. గణపతి భక్తుడు. నుదుటన పెద్ద తిలకం ధరించిన ఆయన చాలామంది కళ్లు తెరిపించారు. తన విశ్వాసం కాకపోయినప్పటికీ సహచర మానవుడు తన ఇష్టదైవాన్ని ఏ అసౌకర్యంలేకుండా ప్రార్థించుకోవడానికి వీలుగా ఆయన ఎంతగానో సహాయపడ్డారు. -
శుక్రవారం ప్రార్థనలకు రాలేదని.. కిరాతకం!
శుక్రవారం మత ప్రార్థనల్లో పాల్గొనకపోవడమే ఆ బాలుడి నేరమైంది. మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని ఆ 16 ఏళ్ల బాలుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు అతి కిరాతకంగా తల నరికి చంపింది. ఈ ఘటన సిరియాలోని ఉత్తర అలెప్పొకు సమీపంలో ఉన్న జరాబ్లస్ పట్టణంలో జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనలేదన్న కారణంతో ఓ 16 ఏళ్ల బాలుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్టు చేశారు. భారీగా గుమిగూడిన ప్రజల ముందు అతన్ని కేవలం కొన్ని నిమిషాలపాటు విచారించి.. ఆ వెంటనే బాలుడిని ప్రజలందరి ముందు తలనరికి చంపారు. ఇంకెవరు కూడా మసీదుల్లో ప్రార్థనలను తప్పించుకోకుండా ఉండేందుకు ప్రజలకు హెచ్చరికలాగా ఈ దారుణ శిక్షను అమలుచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. జరాబ్లస్ నగరం 2013 నుంచి ఐఎస్ఐఎస్ గ్రూప్ అధీనంలో ఉంది. శుక్రవారం నాటి ప్రార్థనల్లో పాల్గొనలేదని అరెస్టు చేసిన మరునాడే బాలుడికి ఈ కిరాతక శిక్షను అమలుచేశారని, సెంట్రల్ జరాబ్లస్ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని హక్కుల కార్యకర్త నాజర్ తల్జ్బిని ఏఆర్ఏ న్యూస్‌కు తెలిపారు. బాలుడికి కిరాతక శిక్ష అమలుచేయడానికి ముందు ఐఎస్ఐఎస్ షరియా కోర్టు జారీచేసిన అధికారిక ప్రకటనను చవిది వినిపించారని, మసీదుల్లో ప్రార్థనలు చేయనివారికి ఇదే రకమైన శిక్ష విధిస్తామని అందులో హెచ్చరించారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇటీవల ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 12 ఏళ్ల బాలికతో ఐదుగురు మహిళలను కాల్చిచంపించిన ఘటన మరువకముందే ఈ కిరాతకం వెలుగులోకి రావడం గమనార్హం.