ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆందోళనలు చెలరేగనున్నాయనే ముందస్తు సమాచారం అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదు సంస్థల దగ్గర భద్రతను పెంచారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న ఇజ్రాయెలీల భద్రతను కాపాడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పర్యాటకు, దౌత్యవేత్తలు సహా సిబ్బందికి భద్రత పెంచాలని కోరింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఇప్పటికే యూదుల భద్రతకు హామీ ఇస్తూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేసిన అనంతరం భారత్ కూడా ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. మొదటి విమానంలో 212 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం
Comments
Please login to add a commentAdd a comment