శుక్రవారం ప్రార్థనలకు రాలేదని.. కిరాతకం!
శుక్రవారం మత ప్రార్థనల్లో పాల్గొనకపోవడమే ఆ బాలుడి నేరమైంది. మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడని ఆ 16 ఏళ్ల బాలుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూపు అతి కిరాతకంగా తల నరికి చంపింది. ఈ ఘటన సిరియాలోని ఉత్తర అలెప్పొకు సమీపంలో ఉన్న జరాబ్లస్ పట్టణంలో జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనలేదన్న కారణంతో ఓ 16 ఏళ్ల బాలుడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్టు చేశారు. భారీగా గుమిగూడిన ప్రజల ముందు అతన్ని కేవలం కొన్ని నిమిషాలపాటు విచారించి.. ఆ వెంటనే బాలుడిని ప్రజలందరి ముందు తలనరికి చంపారు. ఇంకెవరు కూడా మసీదుల్లో ప్రార్థనలను తప్పించుకోకుండా ఉండేందుకు ప్రజలకు హెచ్చరికలాగా ఈ దారుణ శిక్షను అమలుచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
జరాబ్లస్ నగరం 2013 నుంచి ఐఎస్ఐఎస్ గ్రూప్ అధీనంలో ఉంది. శుక్రవారం నాటి ప్రార్థనల్లో పాల్గొనలేదని అరెస్టు చేసిన మరునాడే బాలుడికి ఈ కిరాతక శిక్షను అమలుచేశారని, సెంట్రల్ జరాబ్లస్ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని హక్కుల కార్యకర్త నాజర్ తల్జ్‌బిని ఏఆర్‌ఏ న్యూస్‌కు తెలిపారు. బాలుడికి కిరాతక శిక్ష అమలుచేయడానికి ముందు ఐఎస్‌ఐఎస్ షరియా కోర్టు జారీచేసిన అధికారిక ప్రకటనను చవిది వినిపించారని, మసీదుల్లో ప్రార్థనలు చేయనివారికి ఇదే రకమైన శిక్ష విధిస్తామని అందులో హెచ్చరించారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇటీవల ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 12 ఏళ్ల బాలికతో ఐదుగురు మహిళలను కాల్చిచంపించిన ఘటన మరువకముందే ఈ కిరాతకం వెలుగులోకి రావడం గమనార్హం.