‘కేంద్రం నుంచి స్పష్టత కోసం ధర్నా నిర్వహిస్తాం’ | TRS Dharna Over Clarity From Centre On Procurement Of Parboiled Rice | Sakshi
Sakshi News home page

‘కేంద్రం నుంచి స్పష్టత కోసం ధర్నా నిర్వహిస్తాం’

Published Wed, Nov 17 2021 2:18 AM | Last Updated on Wed, Nov 17 2021 10:38 AM

TRS Dharna Over Clarity From Centre On Procurement Of Parboiled Rice - Sakshi

ఇందిరా పార్క్‌ వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వరి వేసుకోవాలో.. వద్దో, ధాన్యం కొంటరో కొనరో కేంద్రం స్పష్టం చేయాలి. ధర్నా ముగిసిన అనంతరం గవర్నర్‌కు వినతిపత్రం అందిస్తాం.

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో వరి పంట సాగుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఈనెల 18న హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ధర్నా చేపడుతుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందిరా పార్కు వద్ద ఆరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగే ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు.

ధర్నా అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తర్వాత కేంద్రం స్పందన కోసం రెండు రోజులు వేచిచూసి, రైతులు యాసంగిలో ఏ పంట వేసుకోవాలో స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి తమ వైఖరిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని తూర్పార పట్టారు. 

రైతుల ప్రయోజనాల కోసం ఎందాకైనా..
‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో నీతి, పూటకోమాట అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌ ఎంతదాకైనా వెళ్తుంది. బీజేపీని విడిచిపెట్టదు. ధర్నాల డ్రామాలతో బీజేపీ తప్పించుకోలేదు. టీఆర్‌ఎస్‌ వెంటాడి వేటాడుతుంది. రాష్ట్రం నుంచి సంవత్సర కాలానికి ఎంత ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరితే కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది. కేంద్ర మంత్రి చెప్పే మాటలకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పే మాటలకు పొంతన లేదు. తెలంగాణ రైతుల ప్రయోజనాలతో కేంద్రం, బీజేపీ ఆటలాడుకుంటున్నాయి. ధర్నా తరువాత కూడా కేంద్రం దిగిరాకపోతే టీఆర్‌ఎస్‌ తన కార్యాచరణ ప్రకటిస్తుంది. ఈ నెల 18 తర్వాత కూడా మా పోరాటం కొనసాగుతుంది..’ అని కేసీఆర్‌ వెల్లడించారు.   

ప్రధానికి, మంత్రికి లేఖ రాస్తా
‘సంవత్సరానికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్‌ వివరాలను రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని ప్రధానమంత్రికి, సంబంధిత మంత్రికి లేఖ రాస్తా. మాకు సమాధానం కావాలి. పెండింగ్‌ పెడతామంటే కుదరదు. ఉలకం పలకం అంటే ప్రజలే తేల్చుకుంటరు. వరి వేసుకోవాలా వద్దా? ధాన్యాన్ని కొంటరా..? కొనరా? దీనిపై కేంద్రం తన విధానాన్ని స్పష్టం చేయాలని అడుగుతున్నం. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దు. వానాకాలం పంట 60 లక్షల ఎకరాల్లో ఉంది. 20 లక్షల టన్నులు తీసుకుంటమని చెప్పిన్రు. ఇప్పటివరకు ఏం చెప్తలేరు..’ అని విమర్శించారు. 

కేంద్ర వైఖరి వల్లే వరి వద్దంటున్నాం..
‘గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగమైన రైతులను అద్భుతంగా కాపాడుకుంటున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం. తక్షణమే డబ్బులు కూడా పంపిణీ చేశాం. నీటి తీరువా లేకుండా ఉచిత విద్యుత్తుతో రైతుకు అండగా నిలిచాం. సాగునీటితో పంటల స్థిరీకరణ చేసుకున్నాం. యాసంగి పంటకు కూడా  రైతుబంధు డబ్బులు ఇస్తం. కేంద్రం వైఖరి సరిగా లేదు కాబట్టే యాసంగిలో వరి పంటను వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా..’ అని సీఎం చెప్పారు.

ఐదు రోజుల్లో చెబుతామన్నారు కానీ..
‘రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత, దేశ ఆహార అవసరాల నిమిత్తం బçఫర్‌ స్టాక్స్‌ మెయింటైన్‌ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. వడ్లు కొంటే ప్రాసెసింగ్‌లో భాగంగా బియ్యంగా మార్చడమూ కేంద్రం పనే. ఎఫ్‌సీఐ గోడౌన్లు ధాన్యాన్ని నిల్వ చేయాలి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యతే. కానీ రాష్ట్రానికో నీతి, ప్రాంతానికో నీతి అనే పద్ధతిలో కేంద్రం ఉంది. పంజాబ్‌లో మొత్తం వరి ధాన్యాన్ని కొంటున్నారు. మన వద్ద నిరాకరిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ఆహార మంత్రిని కలిసి మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని స్వయంగా నేనే అడిగాను. మరుసటి రోజు ఎఫ్‌సీఐ, ఆహార శాఖ అధికారులతో చర్చించారు. తర్వాత మంత్రులతో చర్చించి ఐదు రోజుల్లో చెప్తామని చెప్పారు. కానీ ఈరోజు వరకు ఉలుకుపలుకు లేదు. అనూరాధ కార్తెలో రైతులు నాట్లు పోస్తరు. ఈనెలలోనే వస్తుంది. ఈలోపు తేల్చి చెప్పే బాధ్యత కేంద్రంపైన ఉంది..’ అని కేసీఆర్‌ అన్నారు. 

ఎఫ్‌సీఐ కొంటామంటే కేంద్రం వద్దంటోంది...
‘గత యాసంగిలో వడ్లు కొంటామని ఎఫ్‌సీఐ చెపితే కేంద్రం నిరాకరించింది. అప్పుడు కేంద్రాన్ని నిలదీశాం. కేంద్రం ఆలస్యం చేస్తోంది. రైతుకు వ్యతిరేకంగా కేంద్రం ఉంది. దీంతో మేం అప్రమత్తమయ్యాం. మీరు ధాన్యం పండించకండి. పంట మార్పిడి చేయండి అని వ్యవసాయ శాఖ మంత్రి మన రైతులకు విజ్ఞప్తి చేశారు. గత యాసంగిలో తెలంగాణలో వచ్చిన ధాన్యాన్ని జూనియర్‌ కాలేజీలు, రైతువేదికలు, ఫంక్షన్‌ హాల్స్‌లో నిల్వ చేశాం. ఆ ధాన్యం ఇప్పటికీ గోదాముల్లోనే ఉంది. గత యాసంగిలో 5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకు మాట్లాడుతలేదు..’ అని విమర్శించారు.

రాజ్యమేలుతున్నారా.. డ్రామాలాడుతున్నారా?
‘గత యాసంగిలో 80:20 నిష్పత్తిలో బియ్యం తీసుకుంటమని చెప్పి, 50 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గాను 24 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకొని 26 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోలేదు. అవి కూడా కొనాలంటే...వచ్చే యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ పండించబోమని హామీ ఇస్తే తీసుకుంటామన్నారు. ఉన్న బియ్యం నిల్వలు మీద పడతాయని, అప్పటికప్పుడు అండర్‌ టేకింగ్‌ ఇచ్చాం. బాయిల్డ్‌ రైస్‌ కాదు.. సంతవ్సరానికి రా రైస్‌ ఎంత కొంటారో అనేదైనా స్పష్టంగా చెప్పమని కేంద్ర మంత్రిని అడిగి 50 రోజులు గడిచినా సమాధానం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వరి వేయమని ఎట్ల చెపుతడు? రా రైస్‌ ఎంత తీసుకుంటరో చెప్పమని అడిగినా ఎందుకు సమాధానం చెప్పుతలేరు. రాజ్యమేలుతున్నారా? డ్రామాలాడుతున్నారా?..’ అని నిలదీశారు. 

యాసంగి వరిపై సంజయ్‌ స్పష్టత ఇవ్వాలి
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ యాసంగిలో వరి పంట వేయాలని రైతులను రెచ్చగొట్టారు. దీంతో కేంద్రమంత్రికి నేనే స్వయంగా ఫోన్‌ చేసి.. సంజయ్‌ మాటలను ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అలా అనకూడదని కేంద్రమంత్రి అన్నారు. తెల్లారి నేనే ప్రెస్‌మీట్‌ పెట్టి బండి సంజయ్‌ను అడిగాను. యాసంగిలో వరి వేయమని చెప్పిన మాటకు కట్టుబడి ఉంటావా? లేక తప్పయిపోయింది అని రైతులకు క్షమాపణ చెపుతావా? అని అడిగిన. కానీ స్పందన లేదు. ఇప్పటికైనా బండి సంజయ్‌ స్పష్టత ఇవ్వాలి. వరి వేస్తే కేంద్రం కొంటుందా లేదా తేల్చకుండా రైతులతో రాజకీయం చేస్తున్నాడు..’ అని కేసీఆర్‌ మండిపడ్డారు. 

వడ్లు కొంటరా కొనరా అనడుగుతె కొడతరా?
‘ఈ  వర్షాకాలం పంటను కొంటామని, కేంద్రం నిర్ణయంతో యాసంగిలో వరి పంటను కొనలేమని చెప్పాను. వర్షాకాలం పంట కోసం 6 వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారు. ధాన్యం కొనకుండా రాజకీయం చేస్తే రైతులు ఊర్కుంటరా? తిరగబడతరు? నిరసన వ్యక్తం చేస్తరు. వడ్లు కొంటరా కొనరా అనడుగుతె కొడతరా? కొనుగోలు కేంద్రం దగ్గర నీకేంపని? ఏం పగులగొడతనని పోయినవ్‌? రాళ్లతో రైతులపై దాడులు చేస్తరా?  

యాసంగిలో వరి వేయమని చెప్పింది నువ్వు కాదా? ఆ మాటకు కట్టుబడి ఉన్నవా? కాదంటే తప్పయిందని చెంప లేసుకొని ముక్కు నేలకు రాయాలి. అసలు వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్నైనా కొంటరా లేదా అని అన్నావా? పిచ్చి పిచ్చి, అర్థరహిత మాటలు, క్షమించరాని మాటల్ని సీరియస్‌గా తీసుకుంటం. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని చెపుతున్నరు? టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో రైతులు లేరా? పంట పండించరా? స్పష్టమైన వైఖరి చెప్పమని అడుగుతరు? అది చెప్పకుండ రైతులపై దాడులు చేస్తమంటే ఎట్లా?..’ అని ప్రశ్నించారు. 

కేంద్రం నల్లచట్టాలను వ్యతిరేకించినం..
‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినం. మాకు స్టాండ్‌ లేదని ఎవరు చెప్పారు..? లోక్‌సభ, రాజ్యసభల్లో మా పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా గొంతు వినిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి చాలాసార్లు వ్యవసాయ నూతన చట్టాలను వ్యతిరేకించారు. ధర్నాలు చేసినం..’ అని కేసీఆర్‌ తెలిపారు. ‘శాంతి భద్రతల సమస్యగా బీజేపీ మారితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కేంద్రం వడ్లు కొంటనంటే కేసీఆర్‌ వద్దంటడా? తెలంగాణ ఉద్యమకారుల గడ్డ. వడ్ల విషయంలో తెలంగాణ బీజేపీని నిలదీస్తది..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement