
సాక్షి, హైదరాబాద్: సొంత నిధులతో ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులను సమకూర్చేందుకు పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును సోమవారం ప్రగతిభవన్‌లో కలసి విరాళాల చెక్కులను అందజేశారు. సొంత నిధులతో ఆరు అంబులెన్సులను సమకూరుస్తానంటూ ఇటీవల కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంబులెన్సులకు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
దీంతో మొత్తంగా వంద అంబులెన్సులను సమకూర్చాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి) రెండు చొప్పున, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు ఒకటి, నవీన్‌కుమార్ రెండు చొప్పున అంబులెన్సులు సమకూరుస్తున్నారు. మరో టీఆర్‌ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఒక అంబులెన్సుకు సంబంధించిన చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా అంబులెన్సు కొనుగోలుకు చెక్కును ఇచ్చినట్లు శంభీపూర్ రాజు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment