ఆక్సిజన్‌ కొరతకు చెక్‌! | TS Government Decided To Store Oxygen At Government Hospitals | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ కొరతకు చెక్‌!

Published Tue, Sep 1 2020 5:03 AM | Last Updated on Tue, Sep 1 2020 5:03 AM

TS Government Decided To Store Oxygen At Government Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కొరత తీరనుంది. ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో భారీగా లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నా అప్పుడప్పుడు అనుకోని అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 22 ఆస్పత్రులు, ఇతర బోధనాస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేయనుంది. అలాగే కొన్నింటి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. దీంతో అదనంగా 4,500 పడకలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులోకి రానుంది.

ఫలితంగా ఆయా ఆస్పత్రులకు ఇక పైప్‌లైన్ల ద్వారా నిరంతరంగా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండనుంది. వారం రోజుల్లో హైదరాబాద్‌లోని టిమ్స్, కింగ్‌ కోఠి, ఛాతి, ఉస్మానియా సహా మొత్తం 9 ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌ బోధనాస్పత్రి, ఆదిలాబాద్‌ రిమ్స్, సంగారెడ్డి బోధనాస్పత్రి ఇలా 22 చోట్ల అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న 6 కిలోలీటర్ల ఆక్సిజన్‌ సామర్థ్యాన్ని మరో 20 కిలోలీటర్లకు పెంచుతారు. అలాగే నిజామాబాద్‌ బోధనాస్పత్రిలో 6 కిలోలీటర్ల సామర్థ్యం ఉంటే, దాన్ని 20 కిలోలీటర్లకు పెంచనున్నారు. 

వందకు మించి ఉంటే ఆక్సిజన్‌ ట్యాంకులు
రాష్ట్రంలో కరోనా చికిత్సలు అందిస్తున్న 42 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 4,673 ఆక్సిజన్‌ పడకలున్నాయి. వీటికి జిల్లాల్లో పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉండటంతో మరో 4,500 పడకలకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. గాంధీ ఆస్పత్రిలో 1,000 ఆక్సిజన్‌ పడకలుంటే, 26 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న భారీ ట్యాంక్‌ అక్కడ మాత్రమే ఉంది. దీంతో 100 పడకలకు మించి ఉన్న ప్రభుత్వాస్పత్రులకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. టిమ్స్‌లో 21 కిలోలీటర్ల ట్యాంక్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్‌ ఎంజీఎంలో 10 కిలోలీటర్ల సామర్థ్యాన్ని 20 కిలోలీటర్లకు పెంచనున్నారు. ఇక వందలోపు పడకలున్న ప్రభుత్వాస్పత్రులకు మరో 6 వేల సిలిండర్లను కొనుగోలు చేయనున్నారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను గుజరాత్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 10 వేల పడకలకు సరిపోయే ఆక్సిజన్‌ పైప్‌లైన్లు వేశారు. ట్యాంకులను నెలకొల్పాక వెంటనే పడకలకు ఆక్సిజన్‌ అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 

ప్రైవేట్‌లో మూడు చోట్లే ట్యాంకులు
హైదరాబాద్‌లో పేరొందిన మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. పైగా అవి కూడా భారీ సామర్థ్యం కలిగినవి కావని చెబుతున్నారు. మిగిలిన ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ సిలిండర్లపైనే ఆధారపడుతున్నాయని, ఒక్కోసారి సిలిండర్ల సరఫరా సకాలంలో రాకపోతే రోగులు ఇబ్బంది పడే ప్రమాదముందని అంటున్నారు. చాలా సందర్భాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పడకలున్నా, ఆక్సిజన్‌ సిలిండర్లు లేక రోగులను చేర్చుకోవడం లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement