సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమతికి మళ్లీ జోష్ వచ్చింది. ఒక సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కమలం చేతిలో ఉన్న స్థానాన్ని కూడా చేజిక్కించుకుని సత్తా చాటింది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ భేరీ మోగించింది. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లలో సత్తా చాటకపోయినా రెండో ప్రాధాన్య ఓట్లతో రెండు స్థానాలు గెలుపొందడం ఒకింత ఆందోళన కలిగించే విషయమే.
ఉత్కంఠగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరిగాయి. మొదటి నుంచి టీఆర్‌ఎస్ ఆధిక్యత కనబరుస్తున్నా.. తీవ్రంగా పోటీ పడాల్సి వచ్చింది. నాలుగు రోజుల పాటు ఊగిసలాడిన విజయం ఎట్టకేలకు అధికార పార్టీ ఖాతాలో పడింది. అయితే ఈ విజయం టీఆర్‌ఎస్‌కు అత్యావసరం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని సాగుతున్న ప్రచారానికి దీంతో తెర పడింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిన గులాబీ పార్టీకి ఈ విజయం ఉపశమనం కలిగించింది.
రాష్ట్రంలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే ఈ విజయం సొంతం కావడం టీఆర్‌ఎస్‌కు లాభించే విషయమే. పైగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానంలో సిట్టింగ్ ఉన్న బీజేపీని ఓడించడం విశేషం. నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు ఈ విజయం అధికార పార్టీకి ఊపిరి పోసింది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహ రావు కుమార్తెను అనూహ్యంగా ఎంపిక చేసి కాంగ్రెస్ ఓట్లకు గాలం వేసింది. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి బలీయమైన నాయకుడుగా ఉన్నారు. ఆ జిల్లాల్లో టీఆర్‌ఎస్ బలీయంగా ఉండడంతో పల్లా విజయం సునాయాసంగా జరిగింది. అయితే తీన్మార్ నవీన్, ప్రొఫెసర్ కోదండరాం గట్టి పోటీ ఇవ్వడం టీఆర్‌ఎస్ అప్రమత్తం కావాల్సిన విషయాన్ని గుర్తు చేసింది.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయని రాజకీయ వర్గాలు భావించగా ఆ అంచనాలు ఈ ఫలితాలు తలకిందులు చేశాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగులకు పీఆర్సీ తదితర ప్రకటించకపోవడం టీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తాయని భావించారు. నిరుద్యోగులంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని చర్చ నడవగా.. అలాంటిదేమీ లేదని ఈ ఫలితాలు నిరూపించాయి. అయితే మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించకపోవడం టీఆర్‌ఎస్‌కు లోలోపల ఒకింత అసహనం ఉంది.
నిరుద్యోగులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పట్టభద్రులు ఈ ఉత్కంఠ ఫలితం ఇచ్చారు. ఈ విజయం ఊపుతో గులాబీ పార్టీ నాగార్జున సాగర్ ఎన్నికకు వెళ్లనుంది. దీని ప్రభావం సాగర్ ఎన్నికపై స్పష్టంగా పడే అవకాశం ఉంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ పరిధిలోనే నాగార్జున సాగర్ ఉండడంతో గులాబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానం కోల్పోవడం బీజేపీకి జీర్ణించుకోలేని విషయం. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో జోరు మీదున్న కాషాయ పార్టీకి పట్టభద్రుల తీర్పుతో నిరాశ ఎదురైంది. సాగర్ ఎన్నిక ముందు ఈ ఫలితం రావడం కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment