సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లు టెన్త్ విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణలు రావడం, ప్రతి స్కూల్ నుంచీ ప్రతి విద్యార్థికీ గరిష్ట మార్కులు రావడంపై ఫిర్యాదులు అందడంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ క్షేత్రస్థాయి విచారణకు పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలంటూ అన్ని ప్రభుత్వ స్కూళ్లు, మండల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలు పరిశీలించాకే స్కూళ్లు పంపిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.
అసలేం జరిగింది?
తెలంగాణలో మే 23 నుంచి టెన్త్ పరీక్షలు జరగనుండగా ప్రతి పేపర్ 80 మార్కులకే ఉండనుంది. మరో 20 మార్కులను విద్యార్థుల ప్రావీణ్యత ఆధారంగా స్కూళ్లు కేటాయించే అంతర్గత మార్కులతో పాఠశాల విద్యాశాఖ కలపాలి. ఇందుకోసం ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్‌లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు ఇవ్వాల్సి ఉంది. ఇలా గుర్తించిన మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాలి.
కానీ ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం 20 మార్కులకు గరిష్టంగా 19 మార్కులు కూడా వేయడం, దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పద్ధతి కనిపించడం అనుమానాలకు కారణమైంది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారని, కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు కూడా చేశాయంటూ ఉన్నతాధికారులకు ఆరోపణలు అందినట్లు తెలియవచ్చింది. దీంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
తనిఖీల తర్వాతే మార్కుల ఖరారు..
పాఠశాలలు పొందుపర్చిన ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను పరిశీలించేందుకు ప్రతి మండల పరిధిలో ఓ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి సబ్జెక్టు నుంచి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. కేటాయించిన స్కూళ్లకు ఈ బృందం వెళ్లి విద్యార్థి ఏడాదిపాటు రాసిన నోట్‌బుక్స్ (ఇందులో రాత విధానం గుర్తిస్తారు), సమాధాన పత్రాలను తనిఖీ చేయనుంది.
అవసరమైతే విద్యార్థితో ముఖాముఖి మాట్లాడి మార్కులను ఖరారు చేయనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ప్రత్యేక బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఇంటర్నల్ మార్కులను పాఠశాల విద్యాశాఖ నిర్ణయించనుంది. ప్రాజెక్టు వర్క్ ఏం చేయించారు? ఎలా చేయించారు? వాటి ఫలితాలను విద్యార్థి ఎలా విశ్లేషించారనే అంశాలకు ఈ బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.
అయితే ఈ పరిశీలనపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా ఇప్పుడు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలన ఎలా వీలవుతుందని, ప్రైవేటు స్కూళ్లు తనిఖీ బృందాలను మేనేజ్ చేసుకుంటే పరిస్థితి ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది టెన్త్ విద్యార్థులుండగా 3 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలోనే ఉన్నారు. అంత మంది విద్యార్థుల రికార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలించడం ఆచరణ సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి
విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడానికే ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో ఎక్కడ చదివినా ఆ విద్యార్థి సామర్థ్యాన్ని నిష్పాక్షికంగా గుర్తించగలగాలి. ఇది సాధ్యం కావాలంటే మొదట్నుంచీ పూర్తిస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
–పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కార్పొరేట్ మాయాజాలమే
ప్రభుత్వ స్కూళ్లలో సామర్థ్యాన్ని బట్టే విద్యార్థులకు మార్కులొస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఇదో పెద్ద మాయాజాలం. అసెస్‌మెంట్ పరీక్ష పేపర్ ఇచ్చి దగ్గరుండి సమాధానాలు రాయిస్తున్నారు. పదికి పది జీపీఏ సాధించడం కోసమే ఇదంతా చేస్తున్నారు.
– చావా రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment