సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రెండేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఈఎంఐ వాయిదాల పద్ధతిలో పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్కో) నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే రెండు మూడు నెలల్లో వెయ్యి వాహనాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. హైస్పీడ్, లోస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా కోసం తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ సిస్టం పాలసీ–2020–30’ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆధారిత వాహనాల స్థానంలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడం ఈ పాలసీ ఉద్దేశం. పాలసీ అమల్లో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్టు టీఎస్ రెడ్కో పేర్కొంది. ఈ వాహనాల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ రాయితీలతో పాటు బ్యాటరీల వ్యయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు లభించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment