
కుషాయిగూడ(హైదరాబాద్): చార్జింగ్ పెట్టిన రెండు ఎలక్ట్రికల్ బైకులు పేలిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జగదేవపూర్‌కు చెందిన పనగట్ల హరిబాబు కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉంటున్నాడు. తన ఎలక్ట్రికల్స్ బైకులకు సోమవారం సాయంత్రం పార్కింగ్ ఏరియాలో చార్జింగ్ పెట్టాడు. పెట్టిన ఒక గంటకే ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చింది.
కిందికి వచ్చి చూడగా తన రెండు బైకులకు మంటలంటకుని దగ్ధమయ్యాయి. ఇటీవల ఎలక్ట్రికల్ బైక్‌ల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. మరో వైపు ఎలక్ట్రిక్ బైక్ కంపెనీలు మాత్రం సేఫ్టీ విషయంలో మాత్రం రాజీ పడకుండా బైకులను తయారీ చేస్తున్నామని చెప్తున్నాయి. ఇలాంటి ఘటనలకు గల అసలు కారణాలను తెలుసుకుని వాటిని పునరావృతం కాకుండా చూస్తామని సంస్థలు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.