నడక మార్గంలో రక్షణ కోసం చిన్నారులకు ట్యాగ్‌లు వేస్తున్న పోలీసులు
తిరుమల: ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలినడక.. ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు చేపట్టింది. సాయంత్రం 6 గంటల తర్వాత నడక దారిలో భక్తులను అనుమతించకూడదని నిర్ణయించింది. అదే విధంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. మధ్యాహ్నం 2 గంటల తరువాత చిన్న పిల్లలతో వచ్చే తల్లిదండ్రులను నడక దారిలో అనుమతించరు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
కాలినడక మార్గాలు, ఘాట్ రోడ్‌లో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెద్దలకు మాత్రమే అలిపిరి కాలినడక మార్గంలో అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు వైపు కాలినడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 సంవత్సరాలలోపు చిన్నారులను తల్లిదండ్రులు, బంధువులతో అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దలను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. శనివారం నుంచి రెండు ఘాట్ రోడ్లలో సాయంత్రం 6 గంటల తరువాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం
నడక మార్గం, ఘాట్ రోడ్లలో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడ చిరుతలు పెరిగినట్టు అటవీ అధికారులకు సమాచారం అందుతోంది. శనివారం కూడా నడక మార్గం, ఘాట్ రోడ్లలోని చిరుతల సంచారం గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలు, గాలి గోపురం నుంచి ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించారు. రెండో ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో భక్తులను అప్రమత్తం చేశారు.
13టీఎమ్‌ఎల్50: నడక మార్గంలోని 7వ మైలు వద్ద చిన్నారులకు ట్యాగ్‌లు వేస్తున్న పోలీసులు
చిన్నారుల రక్షణకు ట్యాగ్‌లు
అలిపిరి నుంచి తిరుమల నడక దారిలోని అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెర గడం, దాడుల నేపథ్యంలో పోలీసులు ముందస్తు రక్షణ చర్యలను చేపట్టారు. ఆదివారం నుంచి అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు ట్యాగ్‌లు వేస్తున్నారు. ట్యాగ్‌లు వేయడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోయినా సులభంగా కనిపెట్టేందుకు వీలవుతుంది. ట్యాగ్‌పై చిన్నారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ నమోదు చేసి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment