మైలార్‌దేవ్‌పల్లి: హైదరాబాద్ పాతబస్తీ మైలార్‌దేవ్‌పల్లిలో అస్వస్థతకు గురైన ఇద్దరు మరణించడం కలకలం రేపుతోంది. కలుషిత నీటి కారణంగానే వీరు మరణించారని స్థానికులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేమీ లేదని జలమండలి అధికారులు చెబుతున్నారు. స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్‌దేవ్‌పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో గత 15 రోజులుగా మంచినీటిలో డ్రైనేజీ నీరు కలిసి సరఫరా అవుతోంది.
ఈ నేపథ్యంలో మొఘల్స్ కాలనీ, శాలివాహన పాఠశాల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిలో కొందరు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మహ్మద్ కైసర్ (28) మంగళవారం మృతి చెందగా, బుధవారం ఉదయం ఆఫ్రిన్ సుల్తానా (22) మరణించింది. కాగా అజారుద్దీన్, మీన్‌బేగం, ఆర్‌పీ సింగ్, షెహజాది బేగం, ఇత్తేషాముద్దీన్, ఇక్రాబేగం అనే మరో ఆరుగురు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.
నష్ట పరిహారానికి డిమాండ్
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటంతో కలకలం రేగింది. నీటిని తాగటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రోడ్డు విస్తరణలో భాగంగా మంచినీటి పైప్‌లను కొత్తగా అమర్చటంలో మురుగునీరు సరఫరా అయ్యిందని ఆరోపించారు. జలమండలి అధికారులపై చర్యలు తీసుకోవాలని, చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సవిషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ జలమండలి అధికారులు చంద్రశేఖర్, ఖాదర్, వారి బృందం ఆ ప్రాంతానికి చేరుకుని మంచినీటి నమూనాలను సేకరించారు. మంచినీళ్లు కలుషితం కాలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment