గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ రైల్వేస్టేషన్ అండర్ పాస్ బ్రిడ్జి ప్రధాన రహదారి మధ్యలో డివైడర్ పక్కన చిరుత
రాజేంద్రనగర్/బహదూర్‌పురా/మైలార్‌దేవ్‌పల్లి: జనావాసంలోకి వచ్చిన చిరుత కలకలం సృష్టిం చింది. నడిరోడ్డుపై సేదదీరుతూ కనిపించిన చిరుత.. జనం హడావుడితో పరుగులు తీస్తూ ఒక రిని గాయపరిచి, సమీపంలోని పొదల్లోకి దూరి పరారైంది. అటవీ శాఖ బృందాలు దాన్ని బంధిం చేందుకు రోజంతా చేసిన యత్నాలు ఫలించ లేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ రైల్వేస్టేషన్ అండర్ పాస్ బ్రిడ్జి ప్రధాన రహదారి మధ్యలో డివైడర్ పక్కన పడుకుని ఉన్న చిరుత పులిని గురువారం ఉదయం 7.30 సమయంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అటుగా రోడ్డున వెళ్తున్న వారు గమనించారు.
ఆ రహదారిపై వాహనాల రాక పోకలు సాగు తున్నా 50 నిమిషాలపాటు చిరుత కదలకుండా ఉంది. దీంతో అది గాయపడి ఉండొచ్చని స్థానికులు భావించారు. ఈలోగా విషయం ఆనోటా ఈనోటా వ్యాపించి జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. అరుస్తూ, కేకలు వేస్తూ.. కొందరు దాన్ని ఫొటోలు తీయగా, ఇంకొందరు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. ఈ హడావుడికి బెదిరిన చిరుత రెండుసార్లు అక్కడే తచ్చాడింది. ఈలోగా కొందరు రాళ్లు విసరడంతో అక్కడి నుంచి ప్రధాన రహదారిపై పరుగులు తీసింది. కొన్ని వీధికుక్కలు వెంబడించడంతో, పక్కనే ఉన్న ప్రహరీ గోడపై నుంచి దూకి అన్మోల్ గార్డెన్ (ఫాంహౌస్)లోపలికెళ్లింది. ఆ సమయంలో చిరుత అక్కడే ఉన్న కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ సుభానీ కాలిని గాయపరిచింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లో రోడ్డు డివైడర్‌కు ఆనుకొని పడుకున్న చిరుత (వృత్తంలో)
కొనసాగుతున్న గాలింపు..
చిరుత గురించి సమాచారాన్ని అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ హకీం, రెస్క్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు 8.30 సమయంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతను బంధించేందుకు జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారి శివయ్య, జూపార్క్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీం, డాక్టర్ అసద్దుల్లాతో పాటు నాలుగు రెస్క్యూ బృందాలు గాలింపు ప్రారంభించాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని జాడ కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించినా ఫలితం లేకపోయింది. చిరుత ప్రవేశించిన గార్డెన్‌లోని ఖాళీ ప్రాంతం దాదాపు 40 ఎకరాల్లో పిచ్చిమొక్కలు, పొదలు, దట్టమైన చెట్లతో నిండి ఉంది. దీని పక్కనే బుద్వేల్ రైల్వే స్టేషన్‌బస్తీ, వెంకటేశ్వర కాలనీ, నేతాజీనగర్, శ్రీరామ్‌నగర్ కాలనీలు ఉండడంతో పోలీసులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు. జూపార్క్ నుంచి తెచ్చిన రెండు బోన్లను అమర్చారు. నాలుగు మేకలను ఎరగా వేశారు. ఆ ప్రదేశం చూట్టూ లైట్లను ఏర్పాటు చేశారు.
ఘటనా స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సందర్శించారు. కాగా, అటవీశాఖ, జూపార్క్ అధికారులు సమాచారం అందుకున్న వెంటనే వచ్చి ఉంటే, దాదాపు 50 నిమిషాల పాటు అండర్‌పాస్ మార్గంలో ఉన్నప్పుడే చిరుత చిక్కి ఉండేది. అనంతరం గాలింపు చేపట్టడంతో రాత్రి వరకు దాని జాడ దొరకలేదు. గార్డెన్ చుట్టుపక్కల గల కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.
ఎక్కడి నుంచి వచ్చిందో..?
ఆరు నెలల క్రితం ఎన్‌ఐఆర్‌డీలోని అటవీ ప్రాంతంలో లేగదూడతో పాటు అడవిపంది కళేబరం కనిపించడంతో సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం కిస్మత్‌పూర్, గ్రీన్‌సిటీ ప్రాంతాల్లో చిరుత కనిపించినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడొచ్చిన చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలలేదు. చిరుత కనిపించిన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు గగన్‌పహాడ్ అటవీ ప్రాంతం, హిమాయత్‌సాగర్ చెరువు, గ్రేహౌండ్స్ ఫైరింగ్‌స్థలం, ఎన్‌ఐఆర్‌డీ, అపార్డ్, కొత్వాల్‌గూడలో దట్టమైన పొదలతో కూడిన ప్రాంతం ఉంది.
చుట్టుపక్కల కొండలు, గుట్టలు కూడా ఉన్నాయి. చిరుతలకు ఇటువంటిది అనువైన ప్రాంతమని అటవీ అధికారులు చెబుతున్నారు. మరోపక్క కాటేదాన్ ఇందిరమ్మ సొసైటీ, జల్‌పల్లి, మారేడ్‌పల్లి, మహేశ్వరం మీదుగా వచ్చిందా అనేదీ ఆరా తీస్తున్నారు. సాధారణంగా చిరుత చీకటిపడ్డాకే బయటికి వస్తుందని, దాన్ని బంధించేందుకు, 24 గంటల పాటు పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.
‘డ్రోన్’ కంటికీ చిక్కని చిరుత జాడ
చిరుత జాడ కనుగొనేందుకు అధికారులు ఉదయం 11 గంటల నుంచే రెండు డ్రోన్ కెమెరాలతో 40 ఎకరాల ప్రాంతాన్ని పూర్తిగా చిత్రీకరించారు. దట్టమైన తుమ్మపొదలు, ఏపుగా పెరిగిన సుబాబుల్ చెట్ల కారణంగా చిరుత కనిపించలేదు. చిరుతను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు, చుట్టుపక్కల 25 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసినట్టు వైల్డ్‌లైఫ్ ఓఎస్‌డీ ఎ.శంకరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏదైనా జంతువు జాడ కనిపించగానే ఈ కెమెరా ట్రాప్‌లు ఆటోమేటిక్‌గా ఫొటో తీస్తాయి. ప్రతి మూడు గంటలకోసారి ఈ కెమెరా మెమరీ చిప్‌లను అధికారులు పరిశీలించారు.
ఫామ్‌హౌస్ వద్ద చిరుత కోసం తనిఖీలు చేస్తున్న పోలీసులు
కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారి (కర్నూలు పాత జాతీయ రహదారి) మీదుగా ఉన్న పెట్రోల్ బంక్‌లు, ప్రైవేటు వ్యాపార కేంద్రాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. తెల్లవారుజాము 4.30 – 5 గంటల మధ్య గగన్‌పహాడ్ పెట్రోల్‌బంక్ వద్ద వీధికుక్కలు గుంపుగా తరుముతున్న దృశ్యాలు కనిపించాయి. అది చిరుతే అయి ఉండొచ్చని, బహుశా గగన్‌పహాడ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఘటన స్థలం నుంచి వెళ్లిపోతున్న చిరుత
Comments
Please login to add a commentAdd a comment