శివరాం, కమల
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం చేపట్టిన పోడుభూముల సర్వే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివరాలిలా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాలో పోడుభూముల సర్వేను సర్వే కమిటీ చైర్మన్ భూక్య శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోడుభూముల వ్యవహారంలో రాశిగుట్టతండా, భూక్యతండా మధ్య కొన్ని విభేదాలున్నాయి.
జాబితాలో భూక్యతండాకు చెందిన బాదావత్ కమల(50), బాదావత్ శివరాం(30) పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. 2004 నుంచే తాము సాగుచేసు కుంటున్నా పేర్లు ఎందుకు లేవంటూ ఆవేదనకు లోనయ్యారు. వీరు సాగు చేసుకుంటున్న భూములు రాశిగుట్ట తండా పరిధిలోకి వస్తాయని.. జాబితాలో పేర్లు లేవని చెప్పగానే శివరాం తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కమల కూడా పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరినీ ఎల్లారెడ్డి పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల 1.20 ఎకరాలు, శివరాం రెండెకరాలు సాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment