సాక్షి, హైదరాబాద్: యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రష్యా దాడుల నేపథ్యంలో అర్ధంతరంగా భారత్‌కు చేరుకున్న విద్యార్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు, వారిని ఆకర్షించేందుకు ఉక్రెయిన్ పొరుగుదేశాలు ప్రయత్నిస్తోంటే, మరోవైపు వారిని నిలబెట్టుకునేందుకు ఉక్రెయిన్ యూనివర్సిటీలు కృషి చేస్తున్నాయి. బోధన మధ్యలోనే ఆగిపోవడాన్ని అదనుగా చేసుకుని ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, పోలండ్, జార్జియా, అర్మేనియా, రుమేనియాల్లోని మెడికల్ కాలేజీలు ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థులకు వల వేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఆగిపోయిన చదువును తమ దేశాల్లో పూర్తి చేయాలంటూ తమ ఏజెంట్ల ద్వారా కోరుతున్నా యి.
‘రుమేనియాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మూడో ఏడాది ఎంబీబీఎస్ తమ దేశంలో తక్కువ ఫీజుతో చేయమంటూ ఏజెంట్ చెప్పాడు’అని కూకట్‌పల్లికి చెందిన ఉక్రెయిన్ వైద్య విద్యార్థిని దివ్య తెలిపింది. ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వచ్చే సమయంలోనే భారత విద్యార్థుల వివరాలను కొంతమంది సేకరించారు. ‘మా కాలేజీతో సంబంధం లేని వాళ్లు అప్పుడు మా ఫోన్ నంబర్లు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. వారం రోజులుగా వాళ్లు ఫోన్ చేస్తున్నారు. హంగేరీలో మిగతా విద్య పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు’అని బోరబండలో ఉంటున్న స్వాతి చెప్పింది.
హడావుడిగా ఆన్‌లైన్: ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు వల వేయడంతో ఉక్రెయిన్ కాలేజీలు హడావుడిగా ఆన్‌లైన్ మంత్రం అందుకుంది. బొకోవినియా స్టేట్ మెడికల్ కాలేజీ గూగుల్ మీట్ ద్వారా ఇప్పటికే వర్చువల్ క్లాసులు ప్రారంభించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, అవి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని మలక్‌పేటలో ఉంటున్న వైద్య విద్యార్థిని రూపా శ్రీవాణి చెప్పారు. యుద్ధం రాకపోతే ఈపాటికి సిలబస్ చాలా వరకూ పూర్తవ్వాల్సి ఉందని, జూన్‌లో రెండో సెమిస్టర్‌కు వెళ్లేవాళ్లమని వారన్నారు. కీలకమైన నాల్గో సంవత్సరంలో ఇంటర్నల్ మెడిసిన్, నరాల సంబంధిత సబ్జెక్టుల ప్రాక్టికల్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తారు. కానీ థియరీ మాత్రమే చెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఎక్కువ మంది వాపోతున్నారు. అనాటమీ కేవలం పుస్తకాల్లోని పాఠాల ద్వారా నేర్చుకుంటే ఎలా బోధపడుతుందని ప్రశ్నిస్తున్నారు.
వేరే చోట విద్య ఎలా?: ఉక్రెయిన్ కాలేజీల్లో పూర్తిగా ఆంగ్లంలోనే విద్యాభ్యాసం ఉంటుంది. విద్యార్థులు తేలికగా సబ్జెక్టు అర్థం చేసుకునే వీలుంది. అదేవిధంగా అక్కడ ఫ్యాకల్టీతో లోతుగా తమ భావాలు పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉక్రెయిన్ పొరుగు దేశాలు చాలావరకూ స్థానిక భాషను అనుసరిస్తున్నాయి. దీనివల్ల హంగేరీ, జార్జియా, పోలండ్ తదితర దేశాల్లో వైద్య విద్య చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈలోపాన్ని గుర్తించిన పొరుగు దేశాల కాలేజీలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేందుకు కొత్త ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తామంటూ గాలం వేస్తున్నాయి. దీంతో ఇప్పటికే కొంతమంది అక్కడ ప్రవేశాలు పొందారు.
ఆన్‌లైన్ అరకొరే: పి.దీప్తి (బొకోవినియన్ స్టేట్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని)
నాల్గో సంవత్సరం వైద్య విద్య బోధన ఈ మధ్యే ఆన్‌లైన్‌లో మొదలుపెట్టారు. ఈ ఏడాది కీలకమైన సబ్జెక్టులుంటాయి. ప్రాక్టికల్స్‌తో నేర్చుకుంటే తప్ప అర్థమయ్యే పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌లో రోజుకు గంట మాత్రమే చెబుతున్నారు. ప్రత్యక్ష బోధనతో పోలిస్తే వైద్య విద్యకు ఆన్‌లైన్ ఏమాత్రం సరిపోదు.
సరిహద్దు దేశాలు ఆకర్షిస్తున్నాయి: రాజు (ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, హైదరాబాద్)
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు తాజా పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ బోధన అనుకున్న స్థాయిలో లేదు. అక్కడి భాషను విద్యార్థులు ఇప్పటికిప్పుడు అర్థం చేసుకోవడమూ కష్టమే. అయితే, ఇవేవీ ఆలోచించకుండానే కొంతమంది చేరుతున్నారు. అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే విద్యార్థులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment