సాక్షి, హైదరాబాద్: స్టార్టప్‌లకు.. ముఖ్యంగా రక్షణ, వైమానిక రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రబిందువు అవుతోందని హైదరాబాద్‌లోని అమెరికన్ దౌత్య కార్యాలయ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. 2008 నాటికి భారత్, అమెరికా మధ్య రక్షణ రంగ వ్యాపారం దాదాపు శూన్యం కాగా ఇప్పుడు వందల కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైన ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వర్క్‌షాప్’లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ, వైమానిక రంగాల్లోని స్టార్టప్ కంపెనీలు తమ ఆలోచనలను వస్తు, సేవల రూపంలోకి తీసుకొచ్చేలా తోడ్పాటునందించేందుకు అమెరికన్ కాన్సులేట్ ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిందన్నారు.
వర్క్‌షాప్‌లో సుమారు 25 స్టార్టప్‌లు పాల్గొంటున్నాయని.. వీటన్నింటినీ 35 ఏళ్ల లోపు వయసు వారు ప్రారంభించారని చెప్పారు. ఇందులో అత్యధికం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోనివేనని, ఇందులోనూ మహిళల నేతృత్వంలో నడుస్తున్నవి ఎక్కువుండటం గర్వకారణమని కొనియాడారు. డిసెంబరు 9న మొదలైన ఈ వర్క్‌షాప్ 11న ముగియనుంది. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగ సంస్థలూ ఇప్పుడు స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. డీఆర్‌డీవో, కేంద్ర రక్షణ శాఖలు వేర్వేరుగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుండటం దీనికి నిదర్శనమన్నారు.
మహిళా స్టార్టప్‌లలో కొన్ని..
ఆర్మ్‌స్ 4 ఏఐ
భౌతిక శాస్త్రవేత్త జాగృతి దబాస్ ఈ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకురాలు. హైదరాబాద్‌లోని వీ హబ్ కేంద్రంగా పనిచేస్తోందీ కంపెనీ. ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి భూమ్మీద ఏ వస్తువు ఎక్కడుందో క్షణాల్లో చెప్పే టెక్నాలజీని సిద్ధం చేసింది. వాహనాల కదలికలు.. ఆయా ప్రాంతాల్లో సమయంతో పాటు వచ్చే మార్పులు, పంటలు, భూ పర్యవేక్షణ, ప్రకృతి విపత్తులకు లోనైన ప్రాంతాల పరిశీలనలో పని చేస్తోంది.
మోర్ఫెడో టెక్నాలజీస్
దేశీయంగా తయారైన తేజస్ యుద్ధ విమానం కీలక విడి భాగం తయారీకి ఎంపికైన స్టార్టప్ ఇది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో అసోసియేట్ డిజైన్ ఇంజినీర్ మిలన్ భట్నాగర్. తేజస్‌లో దాదాపు 358 లైన్ రిప్లేస్‌మెంట్ యూనిట్లు (ఎల్‌ఆర్‌యూ) ఉండగా వీటిల్లో 47 శాతం యూనిట్లు భారత్‌లో తయారు కావట్లేదు. ఈ లోటును పూరించడంలో భాగంగానే టోటల్ ఎయిర్ టెంపరేచర్ ప్రోబ్ ఎల్‌ఆర్‌యూను తయారు చేసే అవకాశం మోర్ఫెడోకు దక్కింది.
పీఎస్–1925
మేకిన్ ఇండియాలో భాగంగా వ్యవసాయం, వైమానిక రంగాల్లో డ్రోన్లను తయారు చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరు షెఫాలీ వినోద్ రామ్‌టెకే. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే 2 వేల మంది రైతులకు సేవలందిస్తున్నారు. హెక్టారు భూమిలోని పంటకు మందులు కొట్టేందుకు రూ.2 వేలకే డ్రోన్లు సమకూరుస్తున్నారు. రక్షణ, ఈ–కామర్స్, ఆరోగ్య, రవాణా రంగలకూ ఉపయోగపడేలా డ్రోన్లు తయారు చేసే పనిలో ఉన్నారు.
ఫ్లై అట్ మ్యాట్ ఇన్నోవేషన్స్
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ డ్రోన్ల తయారీ రంగంలో ఉంది. ఎంఎస్ ఉత్తర దీనికి టెక్నికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. జీఐఎస్ సర్వే, సొంతంగా మ్యాపులు సిద్ధం చేసే డ్రోన్లతో పాటు వరద వంటి ప్రకృతి విపత్తుల్లో సహాయంగా ఉండే యూఏవీలనూ తయారు చేస్తోందీ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment