Joel Reifman
-
హైదరాబాద్‌లో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా స్వాతంత్య్ర వేడుకలను హైదరాబాద్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆ దేశ దౌత్యాధికారి ప్యాట్రి సియా లాసినా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన 246వ అమెరికా స్వాతంత్య్ర వేడుకల ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అమెరికా కాన్సుల్ జనరల్ రీఫ్మన్లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాసినా మాట్లాడుతూ అమెరికా–భారత్‌ల 75 ఏళ్ల భాగస్వామ్య ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు. తమిళిసై మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అమెరికా కంపెనీలు, సంస్థలు, ఆ దేశ పౌరులతో ఉన్న సంబంధాలు బలాన్నిస్తాయని చెప్పారు. అంతకుముందు యూఎస్ నిధులతో నిర్వహిస్తున్న దేశంలోని మొదటి ట్రాన్స్‌జెండర్ ఆస్పత్రిని, నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న నూతన అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్యాట్రిసియా సందర్శించారు. అక్కడ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లతో సమావేశమై నూతన కాన్సులేట్ జనరల్ నిర్మాణ పురోగతి గురించి చర్చించారు. -
పెట్టుబడుల స్వర్గానికి స్వాగతం
అమెరికా, భారత్ సంబంధాల్లో వాణిజ్య పరమైన బంధాలు కీలకమైనవి. అమెరికా, భారతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఔషధ, అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సన్నిహితంగా పనిచేస్తున్నాయి. నిజానికి 2014 నుంచి తెలంగాణలో అమెరికా కంపెనీలు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. భారత్‌లో అమెరికా మదుపులను మేం ప్రోత్సహిస్తూనే, అమెరికాలో భారత పెట్టుబడుల పొత్తులకు కూడా ఎదురుచూస్తున్నాం. అందుచేత ఈ సంవత్సరం ‘సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సదస్సు’ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ‘సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ అమెరికాలో జరిగే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్. ప్రపంచంలో అతిపెద్ద మదుపు మార్కెట్లో అవకాశాల కోసం ఇది వేలాది మదుపుదారులను ప్రపంచ మంతటి నుంచి ఆకర్షిస్తుంటుంది. అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన సెలెక్ట్ యూఎస్ఏ ఆఫీసు నిర్వహించే ఈ సదస్సు... అమెరికాలో అపారమైన మదుపు అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఉప యోగపడుతుంది. ఈ సంవత్సరం భారత్‌లోని అమెరికన్ ఎంబసీ... జూన్ 26 నుంచి 29 వరకు వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న సెలెక్ట్ యూఎస్ఏ సదస్సుకు భారీ భారతీయ వాణిజ్య ప్రతినిధుల బృందం హాజరయ్యేలా చూస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులున్న మార్కెట్. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశాలో కంపెనీ ఉండి... అంత ర్జాతీయంగా ఎదగాలని చూస్తున్నట్లయితే, అమెరి కాలో మీకు అవకాశాలకు కొదవే లేదు. ఏటా 20 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తినీ, 32 కోట్ల మంది ప్రజానీకాన్నీ కలిగి ఉన్న అమెరికా, మీకు ఇతరులతో పోల్చలేని వైవిధ్యభరితమైన అవకాశాలను అంది స్తుంది. అద్భుతమైన న్యాయపాలన, మేధా సంపత్తి హక్కుల పరిరక్షణ, అధునాతనమైన టెక్నాలజీ వంటి అనేక పెట్టుబడి అనుకూల పరిస్థితులు భారత్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లను ఇప్పటికే ఆకర్షించాయి. 2020లో అమెరికాలో భారతీయ పెట్టుబడులు 12.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆరోగ్య సంర క్షణ, ఔషధాలు, టెక్నాలజీ వంటి రంగాల్లో అతిపెద్ద భారతీయ కంపెనీలు అమెరికాలో పెట్టుబడి పెట్టాయి. 2011 నుంచి ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో భారత్ నుంచి 400 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నిర్వహించనున్న సదస్సు... దాదాపు 80 గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చే పెట్టుబడి దారులకు, సంస్థల ప్రతినిధులకు అనేక అవకాశాలను అందిస్తుంది. ఈడీఓలను, సర్వీస్ ప్రొవైడర్లను, ఇండస్ట్రీ నిపుణులను, అంతర్జాతీయ టెక్ స్టార్టప్‌లను కలుసు కుని వారి అనుభవాలు, ముందు ముందు వచ్చే అవకాశాల గురించి చర్చించవచ్చు. అలాగే అమెరికా లోని 50 రాష్ట్రాలు, ప్రాదేశిక ప్రాంతాల నెట్వర్క్. 80కి పైగా కంపెనీలు, మార్కెట్లు, స్పీకర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారితో... ఒక్కొక్కరితో కానీ లేదా గ్రూప్‌లతో కానీ జరిపే సమావేశాలు మీకు పెట్టుబడి ఒప్పందాలను కుదిర్చిపెడతాయి. 100కి పైగా సెషన్లలో పాలసీ, పరిశ్రమల నిపుణుల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. అమెరికా వ్యాప్తంగా పరిశ్రమల భాగస్వాములతో విలువైన భాగస్వామ్యం ఏర్పర్చుకునే అవకాశాలను ఈ సదస్సు అందిస్తుంది. ఈ సదస్సు గురించి మరింత సమాచారానికి, రిజిస్ట్రేషన్ వివరాలకు, selectusasummit.usని చూడండి. సదస్సు గురించి మరింత సమాచారం, రిజిస్టర్ ఎలా చేయాలి వంటి వాటిపై సందేహాలను Andrew.Edlefsen@trade.govకి పంపించవచ్చు. - జోయెల్ రీఫ్‌మన్ యూఎస్ కాన్సుల్ జనరల్, హైదరాబాద్ -
కరోనా కట్టడిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేయడంలో దేశంలోనే ఏపీని ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్ కొనియాడారు. విద్యా విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలనూ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రీఫ్‌మెన్ తన ఫేర్వెల్ విజిట్‌లో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అమెరికా–ఆంధ్ర సంబంధాలు మెరుగుపర్చే విషయంలో అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సర్కార్‌కు, అమెరికన్ కాన్సులేట్‌కు మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం కృషిని కొనియాడారు. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలనూ మెచ్చుకున్నారు. ఆంధ్ర–అమెరికాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు. విశాఖకు అద్భుత అవకాశాలు దేశంలోని గొప్ప నగరాలలో ఒకటిగా రూపొందేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలున్నాయని ముఖ్యమంత్రితో జోయల్ రీఫ్‌మెన్ ప్రస్తావించారు. బలహీనవర్గాలకు 50 శాతానికి పైగా ప్రాధాన్యతనివ్వడాన్ని, అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయడాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన ప్రశంసించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, పాఠశాల విద్యపై సీఎం తీసుకున్న ప్రోత్సాహక చర్యలను జోయల్ రీఫ్‌మెన్ అభినందించారు. విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించే విషయంలో యూఎస్ కాన్సుల్ జనరల్‌కు సీఎం జగన్ అందించిన సహాయానికి రీఫ్‌మెన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక.. దాని పనితీరుపై సంతోషం వ్యక్తంచేశారు. తన మూడేళ్ల పదవీకాలంలో నాలుగుసార్లు సీఎంను కలిసి వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఆంధ్ర–అమెరికా సత్సంబంధాల విషయంలో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేక చొరవను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎం. హరికృష్ణ పాల్గొన్నారు. -
స్టార్టప్‌లకు కేంద్రబిందువుగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: స్టార్టప్‌లకు.. ముఖ్యంగా రక్షణ, వైమానిక రంగ సంస్థలకు హైదరాబాద్ కేంద్రబిందువు అవుతోందని హైదరాబాద్‌లోని అమెరికన్ దౌత్య కార్యాలయ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. 2008 నాటికి భారత్, అమెరికా మధ్య రక్షణ రంగ వ్యాపారం దాదాపు శూన్యం కాగా ఇప్పుడు వందల కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైన ‘డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వర్క్‌షాప్’లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ, వైమానిక రంగాల్లోని స్టార్టప్ కంపెనీలు తమ ఆలోచనలను వస్తు, సేవల రూపంలోకి తీసుకొచ్చేలా తోడ్పాటునందించేందుకు అమెరికన్ కాన్సులేట్ ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిందన్నారు. వర్క్‌షాప్‌లో సుమారు 25 స్టార్టప్‌లు పాల్గొంటున్నాయని.. వీటన్నింటినీ 35 ఏళ్ల లోపు వయసు వారు ప్రారంభించారని చెప్పారు. ఇందులో అత్యధికం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోనివేనని, ఇందులోనూ మహిళల నేతృత్వంలో నడుస్తున్నవి ఎక్కువుండటం గర్వకారణమని కొనియాడారు. డిసెంబరు 9న మొదలైన ఈ వర్క్‌షాప్ 11న ముగియనుంది. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగ సంస్థలూ ఇప్పుడు స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. డీఆర్డీవో, కేంద్ర రక్షణ శాఖలు వేర్వేరుగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుండటం దీనికి నిదర్శనమన్నారు. మహిళా స్టార్టప్‌లలో కొన్ని.. ఆర్మ్స్ 4 ఏఐ భౌతిక శాస్త్రవేత్త జాగృతి దబాస్ ఈ స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకురాలు. హైదరాబాద్‌లోని వీ హబ్ కేంద్రంగా పనిచేస్తోందీ కంపెనీ. ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి భూమ్మీద ఏ వస్తువు ఎక్కడుందో క్షణాల్లో చెప్పే టెక్నాలజీని సిద్ధం చేసింది. వాహనాల కదలికలు.. ఆయా ప్రాంతాల్లో సమయంతో పాటు వచ్చే మార్పులు, పంటలు, భూ పర్యవేక్షణ, ప్రకృతి విపత్తులకు లోనైన ప్రాంతాల పరిశీలనలో పని చేస్తోంది. మోర్ఫెడో టెక్నాలజీస్ దేశీయంగా తయారైన తేజస్ యుద్ధ విమానం కీలక విడి భాగం తయారీకి ఎంపికైన స్టార్టప్ ఇది. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో అసోసియేట్ డిజైన్ ఇంజినీర్ మిలన్ భట్నాగర్. తేజస్‌లో దాదాపు 358 లైన్ రిప్లేస్మెంట్ యూనిట్లు (ఎల్‌ఆర్‌యూ) ఉండగా వీటిల్లో 47 శాతం యూనిట్లు భారత్‌లో తయారు కావట్లేదు. ఈ లోటును పూరించడంలో భాగంగానే టోటల్ ఎయిర్ టెంపరేచర్ ప్రోబ్ ఎల్ఆర్యూను తయారు చేసే అవకాశం మోర్ఫెడోకు దక్కింది. పీఎస్–1925 మేకిన్ ఇండియాలో భాగంగా వ్యవసాయం, వైమానిక రంగాల్లో డ్రోన్లను తయారు చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరు షెఫాలీ వినోద్ రామ్టెకే. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే 2 వేల మంది రైతులకు సేవలందిస్తున్నారు. హెక్టారు భూమిలోని పంటకు మందులు కొట్టేందుకు రూ.2 వేలకే డ్రోన్లు సమకూరుస్తున్నారు. రక్షణ, ఈ–కామర్స్, ఆరోగ్య, రవాణా రంగలకూ ఉపయోగపడేలా డ్రోన్లు తయారు చేసే పనిలో ఉన్నారు. ఫ్లై అట్ మ్యాట్ ఇన్నోవేషన్స్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ డ్రోన్ల తయారీ రంగంలో ఉంది. ఎంఎస్ ఉత్తర దీనికి టెక్నికల్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. జీఐఎస్ సర్వే, సొంతంగా మ్యాపులు సిద్ధం చేసే డ్రోన్లతో పాటు వరద వంటి ప్రకృతి విపత్తుల్లో సహాయంగా ఉండే యూఏవీలనూ తయారు చేస్తోందీ కంపెనీ. -
హైదరాబాద్‌లో అతిపెద్ద యూఎస్ కాన్సులేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో యూఎస్ కాన్సులేట్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో రానుంది. ముంబైలో ఉన్న దౌత్య కార్యాలయం కంటే ఇది భారీగా ఉంటుందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ వెల్లడించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శుక్రవారం ఏర్పాటు చేసిన సీఈవో ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 18 నెలల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు. -
ప్రభుత్వ పాలనా సంస్కరణలకు రిఫ్మాన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ ప్రశంసలు కురిపించారు. కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి రిఫ్మాన్కు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. గవర్నర్‌తోనూ భేటీ.. అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమెరికా తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడ్పాటు అందించాలన్నారు. దీనిపై రిఫ్మాన్ సానుకూలంగా స్పందిస్తూ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ అభివృద్ధి ప్రాజెక్టుకు తాము సహకారం అందిస్తున్నామని చెప్పారు. తాను మంగళవారం విశాఖపట్నంలో పర్యటించి ఆ ప్రాజెక్టు పనులను పరిశీలించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావుతోపాటు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌తో అమెరికన్ కాన్సుల్ జనరల్ భేటీ
-
సీఎంను కలిసిన అమెరికన్ కాన్సులేట్ జనరల్
సాక్షి, తాడేపల్లి: హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్మాన్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై రిఫ్మాన్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు ముఖ్యమంత్రితో హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ ఎస్ఈజెడ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌వేర్ తయారీ కోసం ప్రత్యేక ఆర్ధిక మండలి( ఎస్ఈజెడ్) ఏర్పాటుపై చర్చించారు. ఈ ఆర్ధిక మండలి ఏర్పాటుకు రూ.700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇంటెలిజెంట్ ఎస్ఈజెడ్ ప్రతినిధులు చెప్పారు. అనుమతి ఇచ్చిన ఐదేళ్లలోగా రూ.350కోట్ల రూపాయల ఖర్చుతో మొదట విడత పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారు. విస్తరణ రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ అనుబంధ సంస్ధే ఇంటెలిజెంట్ ఎస్ఈజెడ్ డెవలప్మెంట్ లిమిటెడ్. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్ బ్రాండ్ ఉత్పత్తులు ఈ సంస్ధ నుంచే వస్తున్నాయి. భారత్, చైనా, వియత్నాం దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రూ. 1750 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్లను నిర్వహిస్తూ 25వేలమందికి ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలిస్తోంది. నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్వేర్ ఎస్ఈజెడ్లో ఇంటెలిజెంట్ సంస్ధ భాగస్వామి. ఏపీలో 2006 నుంచి ఈ సంస్ధ నెలకు 12 లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, 11వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అలాగే వియత్నాంలో కూడా ఏడాదికి 50లక్షల జతల పుట్‌వేర్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఆ దేశంలో దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. గవర్నర్‌ను కలిసిన కాన్సులేట్ జనరల్ కాగా అంతకు ముందు అమెరికన్ కాన్సుల్ జనరల్ రీఫ్‌మెన్, కాన్సుల్ సభ్యులు బుధవారం రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరువురి మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ క్రమంలోనే విశాఖ స్మార్ట్ సిటి ఏర్పాటులో తమ భాగస్వామ్యం ఉంటుందని, నిధులు సద్వినియోగం అవుతున్నాయని కాన్సుల్ జనరల్ వివరించారు. అమెరికన్ కంపెనీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వారే గణనీయంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింతగా వారికి అవకాశాలు వచ్చేలా చూస్తామని తెలిపారు. అలాగే అమెరికా, భారత్‌లోని గవర్నర్ వ్యవస్ధలపై వీరిరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. -
కేటీఆర్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : అభివృద్దిలో దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మాసాబ్‌ట్యాంకులోని పురపాలక శాఖ భవనంలో మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండో పర్యాయం రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌కు రీఫ్‌మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తులో పెట్టుబడి అవకాశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను కేటీర్ వివరించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్‌తో పాటు కాన్సులర్ ఛీఫ్ ఎరిక్ అలగ్జాండర్, ఎకానమిక్ స్పెషలిస్ట్ క్రిష్టెన్ లోయిర్ లు కేటీఆర్‌ను కలిసిన అమెరికన్ బృందంలో ఉన్నారు. సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఉన్నారు.