
సాక్షి, హైదరాబాద్ : అభివృద్దిలో దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మాసాబ్‌ట్యాంకులోని పురపాలక శాఖ భవనంలో మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండో పర్యాయం రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌కు రీఫ్‌మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తులో పెట్టుబడి అవకాశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను కేటీర్ వివరించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్‌తో పాటు కాన్సులర్ ఛీఫ్ ఎరిక్ అలగ్జాండర్, ఎకానమిక్ స్పెషలిస్ట్ క్రిష్టెన్ లోయిర్ లు కేటీఆర్‌ను కలిసిన అమెరికన్ బృందంలో ఉన్నారు. సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఉన్నారు.