భద్రాద్రి
సాక్షి, హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి.. ఈ రోజున వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంటాయి. ఆయా దేవాలయాలు ప్రత్యేక అలంక రణలతో అలరిస్తాయి. కానీ కోవిడ్ నేపథ్యంలో ఈసారి దేవాలయాల్లో ఆడంబరాలు లేకుండా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమివ్వ బోతున్నారు. చిన్న చిన్న దేవాలయాల్లో భక్తులకు ప్రవేశం ఉన్నా, పెద్ద దేవాలయాల్లో ఆంతరంగిక వేడుకగానే నిర్వహించనున్నారు. తెలంగాణలో వైకుంఠ ఏకాదశికి పరవశించే భద్రాద్రిలో ఈ వేడుకను పూర్తిగా ఆంతరంగికంగా నిర్వహిస్తున్నారు. సాధారణ భక్తులకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇవ్వట్లేదు. చదవండి: (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం)
అర్చకస్వాములు, వేదపండితుల సమక్షంలో ఉదయం 4 గంటలకే ఉత్తర ద్వారం వద్ద ఎప్పటిలాగానే వేడుకలు నిర్వహించనున్నారు. పూజాధికాల తర్వాత ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్తారు. అక్కడ సాధారణ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉత్సవాల చివరి రోజైన గురువారం నిర్వహించిన తెప్పోత్సవాన్ని గోదావరిలో కాకుండా దేవాలయం వద్దే చిన్న నీటి గుండాన్ని నిర్మించి నిర్వహించారు. ఇక, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా కోవిడ్ నిబంధనలకు లోబడే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.
ఉదయం 6–43 గంటలకు తూర్పుద్వారం గుండా స్వామి వారి వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. కాగా, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ ఆరు రోజులపాటు ఆర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం, హిమాయత్‌నగర్‌లోని తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయం, శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం, జియాగూడ రంగనాథ స్వామి దేవాలయాలతో పాటు అన్ని వైష్ణవాలయాల్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అన్ని చోట్లా కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులను అనుమతించనున్నారు. ప్రధాన దేవాలయాల్లో పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లుపైబడ్డ భక్తులను అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment