ఇజ్రా చిట్టెంపల్లి.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో ఓ చిన్న గ్రామం. 300 కుటుంబాలు ఉన్న గ్రామంలో అందరూ గిరిజనులే. అందరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. అలాంటి పల్లె దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఉదయాన్నే దూసుకొచ్చిన మృత్యుశకటం ఐదు కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఐదుగురివి పేద కుటుంబాలే. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు సమీప బంధువులు, దాయాదులు. మృతులు జాటోత్ సోనాబాయి, నితిన్, జాటోత్ శేనిబాయి, జాటోత్ రేణుకాబాయి దాయాది కుటుంబాలకు చెందినవారు కాగా, రమావత్ సంధ్య వీరికి సమీప బంధువు. – మోమిన్‌పేట
15 రోజుల్లో పెళ్లి..
చిట్టెంపల్లికి చెందిన కమల్, శవంత దంపతులు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకూతురు సంధ్య వికారాబాద్ కొత్తగడి సమీపంలో ఉన్న సమీకృత హాస్టల్‌లో ఉంటూ నలంద కాలేజీలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి టాపర్ అయిన సంధ్య కరాటే కూడా నేర్చుకుంది. కరోనా కారణంగా కళాశాలకు సెలవు ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ కుటుంబానికి ఆసరాగా రోజూ కూలిపనులకు వెళ్తోంది. కమల్ సోదరి కుమారుడితో జనవరి 10న సంధ్య వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం ఆమెతో వికారాబాద్‌లో పూజలు చేయించాలనుకున్నారు. పెళ్లి బట్టలు కొనడంతోపాటు పత్రికలు రాసుకునేందుకు సిద్ధ మయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కూలిపనులకు బయలుదేరి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. చదవండి: (మృత్యుశకటం!)
తిరిగిరాని లోకాలకు చదువులతల్లి..
కమల్, జీనిబాయిల రెండో కుమార్తె సోనీబాయి(16)కి చదువుల తల్లిగా గ్రామంలో పేరుంది. ప్రస్తుతం ఆమె వికారాబాద్ కొత్తగడి సమీకృత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ఉండటంతో ఇంటివద్దే ఉంటూ కూలిపనులకు వెళ్తోంది. ఈ క్రమంలోనే శనివారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. సోనిబాయి అక్క స్వప్నకు మాటలు రావు. త మ్ముడు చిన్నవాడు. దీంతో సోనిబాయిని బాగా చదివించి ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు భావిం చారు. కానీ రోడ్డు ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది.
కూలిపనులకు వద్దన్నా వెళ్లి..
చిట్టెంపల్లికి చెందిన శేనిబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లిళ్లు అయిపోయాయి. భర్త బాబు వ్యవసాయ కూలీ. శేనిబాయి పెద్దకుమారుడు వినోద్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రతినెలా డబ్బులు పంపిస్తానని, కూలిపనులకు వెళ్లొద్దని తల్లిని నిత్యం వారించేవాడు. అయినా ఆమె వినిపించుకునేది కాదు. 10 రోజుల క్రితం కూడా తల్లితో మాట్లాడిన వినోద్.. కూలికి వెళ్లవద్దని నచ్చజెప్పాడు. కొడుకు వారిస్తున్నా వినకుండా శనివారం పనులకు బయలుదేరి, ప్రాణాలు కోల్పోయింది.
పిల్లలను వదిలి..
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేణుకాబాయికి ఐదేళ్ల కూతురు సింధు, మూడేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నారు. భర్త వినోద్ వ్యవసాయ కూలీ. రేణుకాబాయి రోజు మాదిరిగానే పనులకు బయలుదేరి వెళ్లి ప్రమాదంలో అసువులు బాసింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి ఆలనాపాలనకు దూరమయ్యారు.
నానమ్మ దశదినకర్మ మరుసటిరోజే..
నానమ్మ దశ దినకర్మ మరుసటిరోజే మనవడు మృతిచెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. చిట్టెంపల్లికి చెందిన మోతీలాల్, మంగీబాయికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వారిలో జాటోత్ నితిన్(16) చిన్నవాడు. నితిన్ రంగారెడ్డి జిల్లా యాచారంలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా ఇంటివద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తున్నాడు. ఇటీవల నానమ్మ మంకీబాయి మృతి చెందటంతో పది రోజులుగా పనులకు వెళ్లడంలేదు. శుక్రవారం దశదినకర్మ ముగియటంతో శనివారం ఉదయం పత్తి తీసేందుకు బయలుదేరి విగతజీవుడయ్యాడు. ఆటో డ్రైవర్ హరి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావించిన నితిన్ తండ్రి మోతీలాల్.. అతడి ఇంటి పైకప్పు కూల్చివేశాడు.
Comments
Please login to add a commentAdd a comment