తల్లి లక్ష్మితో రాజన్‌బాబు (ఫైల్)
గీసుకొండ: కరోనా రక్కసి ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. ఓ వ్యక్తి ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు దక్కలేదు. పైగా కుటుంబం మొత్తం కుదేలైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్‌బాబు (45) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. నగరంలోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటూ ఐరన్, సిమెంట్ వ్యాపారంతో పాటు జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాజన్‌బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరస్ సోకింది. అందరూ హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో రాజన్‌బాబు ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్‌లోని మియాపూర్, సాగర్ రింగ్‌రోడ్డు, జేఎన్‌టీయూ హౌసింగ్ బోర్డు కాలనీలో గల మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రోజుకు రూ.లక్షకు పైగా వెచ్చించారు. ప్రాణాలు దక్కితే చాలు అని ఖర్చుకు వెనుకాడలేదు. డబ్బుల కోసం ఫ్లాట్‌ను అమ్మేశారు. కాగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డబ్బు తీసుకుంటూనే రాత్రిపూట ఆక్సిజన్ తీసివేస్తున్నట్లు గుర్తించారు.
ఇష్టానుసారంగా డబ్బులు గుంజుతూ.. సరైన వైద్యం అందించడం లేదని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రాజన్‌బాబు మృతి చెందాడు. మొత్తంగా చికిత్స కోసం ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు ఇతరత్రా అన్నీ కలిసి రూ.46 లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటీవల రాజన్‌బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment