15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment