సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.
జీవో 55 ప్రకారం..
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను.. మల్టీజోన్ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ తదితర కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తించాలి. ఈ లెక్కన గతంలో 503 పోస్టులకుగాను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేపట్టారు. మొత్తం 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. దివ్యాంగుల కేటగిరీలో రెండు పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు.
జీవో 29 ప్రకారం..
రిజర్వేషన్ ప్రకారం కాకుండా.. నేరుగా మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఇలా 50 రెట్ల మందిని ఎంపిక చేసినప్పుడు.. రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, తర్వాతి మెరిట్ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 22, 22ఏ ఆధారంగా వీరి ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి.. జీవో 29 ఇచ్చారు.
వివాదం ఏమిటి?
ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. జీవో 55కు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడు జీవో 29 ప్రకారం ఎంపిక చేపట్టారు. అంటే నేరుగా మెరిట్ లిస్టులోని 28,150 మందిని ఎంపిక చేశారు. వీరిని ఓపెన్ కాంపిటీషన్, రిజర్వుడ్ కేటగిరీలు విభజించారు.
ఇందులో రిజర్వుడ్ కేటగిరీల్లో 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండటంతో.. కింది మెరిట్ ఆధారంగా అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే 28,150 మందికి మరో 3,233 మంది అదనంగా.. 31,383 మంది అభ్యర్థులను కమిషన్ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. 1:50 నిష్పత్తి కంటే అభ్యర్థుల సంఖ్య పెరగడం, అందులో రిజర్వుడ్ కేటగిరీలవారు చాలినంత మంది లేకపోవడమంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టేనని, ఇది రిజర్వేషన్లకు దెబ్బ అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన.. ముట్టడి.. ఉద్రిక్తం!
Comments
Please login to add a commentAdd a comment