విధ్వంసం తర్వాత స్టేషన్ పరిస్థితి ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఆర్మీ ఉద్యోగార్థుల ఆందోళన, రైల్వేస్టేషన్‌లో విధ్వంసం వెనుక అగ్నిపథ్ సృష్టించిన తీవ్ర నిరాశే అసలు కారణమని అభ్యర్థుల మాటల్లో వెల్లడైంది. పాత రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రద్దు చేయడానికి తోడు.. అగ్నిపథ్‌లో పెట్టిన వయోపరిమితి ఆందోళనకు బీజం వేసింది. రాష్ట్రంలో 2020లో ఆర్మీ ఉద్యోగ ఎంపిక ప్రక్రియకు నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
2021 మార్చి 26 నుంచి 31 వరకు నిర్వహించిన పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షలకు 6,900 మంది హాజరయ్యారు. వీటిల్లో 2,800 మందికిపైగా అర్హత సాధించారు. చివరిగా రాత పరీక్ష జరగాల్సి ఉంది. అయితే గతేడాది మేలో కరోనా మహమ్మారి కారణంగా రాతపరీక్షను వాయిదా వేశారు. తర్వాత గతేడాది నవంబర్‌లో రాతపరీక్ష ఉంటుందని ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు.
దీనితో అభ్యర్థులు శిక్షణలో నిమగ్నమయ్యారు. నవంబర్ వచ్చినా ఆర్మీ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో ఉన్న రిక్రూట్‌మెంట్ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆరు నెలలు గడిచింది. తీరా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను రద్దు చేస్తున్నట్టు గత నెల 31న ఆర్మీ అధికారులు ప్రకటించారు.
దీనితో అభ్యర్థులంతా నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే అగ్నిపథ్‌ను ప్రకటించడం అగ్నికి ఆజ్యం పోసింది. ఈ నెల 17న నిరసన వ్యక్తం చేసేందుకు అభ్యర్థులంతా రావాలని కొందరు ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ముఖ్యంగా పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయిన 2,800 మంది అభ్యర్థుతోపాటు ఆశావహులూ ఆందోళనకు దిగారు.
పాత పద్ధతికే డిమాండ్.. : కేంద్రం పాత పద్ధతిని, నోటిఫికేషన్లను రద్దు చేసిందని.. కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ ‘టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)’ద్వారానే నియామకాలు చేయాల్సి ఉంటుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. పాత పద్ధతిలో 23 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. కానీ అగ్నిపథ్‌లో గరిష్ట వయో పరిమితి 21 ఏళ్లు మాత్రమే. దీనితో అభ్యర్థులు ఆందోళనకు, ఒత్తిడికి గురయ్యారు.
కొత్త పద్ధతి వల్ల తీవ్రంగా నష్టపోతామని, పాత పద్ధతిలోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆందోళనకు దిగారు. 2021 మార్చిలో పరుగు పందెం, దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయిన 2,800 మందిలో 2,400 మందికిపైగా 22 నుంచి 23ఏళ్ల వయసు వారేనని సమాచారం. రిక్రూట్‌మెంట్‌కు అర్హత కోల్పోతుండటంతో ఆందోళనకు పూనుకున్నట్టు తెలిసింది. నిరసనకు దిగినవారు కూడా ఇవే అంశాలను స్పష్టం చేశారు.
చివరి నిమిషంలో నిబంధనలు మారుస్తారా?
ఆర్మీలో చేరి దేశం కోసం ప్రాణాలు ఇద్దామనుకున్నాం. ఆ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చింది. నాలుగేళ్లు కష్టపడి ఆర్మీలో చేరేందుకు ఫిజికల్, మెడికల్ టెస్టుల్లో ఎంపికయ్యాం. తీరా ఉద్యోగం ఇవ్వకుండా నిబంధనలు మార్చితే మా జీవితం ఎందుకు? మా తర్వాతి యువకులకైనా న్యాయం జరగడం కోసం ఆందోళనకు దిగాం. అవసరమైతే ప్రాణత్యాగాలకూ సిద్ధం
– రాకేశ్, కొమురంభీం జిల్లా మా రిక్రూట్‌మెంట్
కొనసాగించాలి
ముందుగా అనుకునే ఆందోళనకు దిగాం. 21 వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నాం. అందులో నిర్ణయించుకున్న సమయం ప్రకారమే రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలి. పరీక్ష తేదీని ముందుగా ప్రకటించాలి.
– పవన్‌రెడ్డి, గోదావరిఖని
Comments
Please login to add a commentAdd a comment