హైదరాబాద్, సాక్షి: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను నగర పోలీసులు దాదాపు ధృవీకరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకుగానూ శుక్రవారం(నవంబర్ 13) మధ్యాహ్నాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే..
అరెస్ట్ టైంలో పోలీసులు అతి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పోలీసులు వెళ్లిన టైంలో.. అల్లు అర్జున్ నైట్ దుస్తులతో ఉన్నారు. తమతో రావాలని కోరగానే.. డ్రస్ మార్చుకుంటానని అన్నారాయన. దీంతో బెడ్ రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి మరీ తీసుకెళ్లారు. ఆ టైంలో అరెస్ట్ సమయంలో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
‘‘బెడ్ రూంలోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూమచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా?. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా?’’ అంటూ అల్లు అర్జున్ పోలీసులను నిలదీసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఏం చెప్పకుండా ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావిడితో భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అవ్వగా.. ఆమెను అల్లు అర్జున్ ఓదార్చారు. ఇక.. తనయుడి వెంట అల్లు అరవింద్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని వాహనం నుంచి దించేశారు. ‘మంచైనా చెడైనా నాదేనంటూ..’ ఆ టైంలో అల్లు అర్జున్ , అరవింద్‌తో అన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
నాలుగు సెక్షన్ల కింద కేసు
భారత న్యాయ సంహిత సెక్షన్లు 105, 118(1) రెడ్‌విత్ 3/5 కింద కేసు పెట్టారు. ఇందులో 105 నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్‌హం. ఈ కేసులో గనుక నేరం రుజువైతే కనీసం ఐదేళ్లు.. గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అలాగే.. బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ చూసుకుంటే ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడుతుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య ధియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ కోసం భారీగా అభిమానులు ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా...ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సంధ్య థియేటర్ యజమానులలో ఒకరైన ఎం సందీప్‌ను, సీనియర్ మేనేజర్ నాగరాజు, లోయర్ బాల్కనీ మేనేజర్ విజయ్ చందర్ ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి.. తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ, అలాంటి నోటీసులేం జారీ చేయకుండానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
హైకోర్టులో పిటిషన్ ఉండగానే..
ఈకేసుకు సంబంధించిన అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఉండగానే అరెస్ట్ కావడం గమనార్హం.
మాకేం సంబంధం లేదు!
తమకు సంబంధం లేకుండా, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో తప్పుడు కేసు నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
‘ప్రీమియర్ షో నిర్వహణ థియేటర్ యాజమాన్యం నిర్ణయం కాదు. చట్టప్రకారం గత నెల 29న ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రదర్శనపై మైత్రి డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నెల 4, 5 తేదీల్లో బెనిఫిట్ షో కోసం గత నెల 30 నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున చిక్కడపల్లి పోలీసులకు, ట్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది.
.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా భారీగా వచ్చిన అభిమానులతో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు మహిళ మృతి ఘటన చోటుచేసుకుందే తప్ప ఇది హత్య కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేసింది కాదు. ఈ ఘటనలో మా ప్రమేయం ఏమీ లేదు. అయినా మేం దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో తదుపరి విచారణ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment