ప్రతీకాత్మక చిత్రం
నల్లగొండ క్రైం : సఖ్యతకు అడ్డొస్తున్నాడని ఓ మహిళ ఘాతుకానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానగల్‌కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (40) బోరు బావుల తవ్వకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య సుజాత పత్తి కూలి మేస్త్రీగా పనిచేస్తోంది. వీరికి కూతురు, కుమారుడు సంతానం. సుజాత పత్తి కూలీలను తీసుకుపోయే క్రమంలో చెర్వుగట్టుకు చెందిన లింగస్వామితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో సుమారు మూడు మాసాల క్రితం ఇద్దరూ ఇళ్లనుంచి పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇద్దరిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి సుజాతను భర్త వెంకన్న వద్దకు పంపించారు. తమ సఖ్యతకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని అప్పటినుంచే ఇందిర నిర్ణయించుకుంది.
ప్రియుడికి ఫోన్ చేసి..
వెంకన్న శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లి వచ్చాడు. పూటుగా మద్యం తాగి పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన సుజాత భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే ప్రియుడు లింగస్వామికి ఫోన్ చేసి రప్పించింది. అనంతరం ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న వెంకన్నను దిండుతో అదిమిపట్టి, గొంతునులిమి హత్య చేశారు.
మద్యం మత్తులో చనిపోయాడని..
వెంకన్న హత్య చేసిన తర్వాత లింగస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తదనంతరం సుజాత తన భర్త మద్యం మత్తులో చనిపోయాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసులకు తానే ఫోన్ చేసి భర్త మద్యం తాగి కిందపడ్డాడని, ఆ క్రమంలోనే సొరగుంచి చనిపోయాడని వివరించింది. భర్త తరఫు వారు తానే హత్య చేసినట్లు బెదిరిస్తున్నారని వాపోయింది. అయితే, సుజాత, లింగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుని గతంలో ఇంటినుంచి పారిపోయారని, పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా ఉందని వెంకన్న తండ్రి పోలీసులకు వివరించాడు. అనుమానంతో పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. హత్యోదంతం విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడి తండ్రి భిక్షమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
గతంలోనూ పలుమార్లు హత్యకు కుట్ర
సుజాత, లింగస్వామి కలిసి గతంలోనూ వెంకన్నను హత్య చేయాలని కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 24న వెంకన్న బైక్‌పై జనగామ జిల్లాకు వెళ్తుండగా లింగస్వామి తన స్నేహితులతో కలిసి కారుతో ఢీకొట్టి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, అది సాధ్యపడలేదని తేలింది. మరోమారు ఈ నెల 28న సుజాత భర్త తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అది తిన్న వెంకన్నకు ఏమీ కాలేదని పోలీసుల విచారణలో సుజాత ఒప్పుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment