సీఎం ‍కేసీఆర్‌ ఈసారైనా వస్తారా..? | Will CM KCR Attend Sita Ramachandra Swamy Kalyanam At Bhadradri | Sakshi
Sakshi News home page

సీఎం ‍కేసీఆర్‌ ఈసారైనా వస్తారా..?

Published Tue, Mar 29 2022 12:03 AM | Last Updated on Tue, Mar 29 2022 11:50 AM

Will CM KCR Attend Sita Ramachandra Swamy Kalyanam At Bhadradri - Sakshi

శ్రీరామనవమి వేడుకల్లో సీఎం కేసీఆర్‌ దంపతులు(ఫైల్‌)

భద్రాచలం: శ్రీరామనవమికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సారైనా వస్తారా? ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొస్తారా? యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇక భద్రాద్రిపై దృష్టి పెడతారా? రూ.100 కోట్ల అభివృద్ధి ప్రకటనను అమలు చేస్తారా.. అనే ప్రశ్నలు భక్తుల మెదళ్లను తొలుస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక 2016లో తొలిసారిగా సీఎం దంపతులు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

అనంతరం మళ్లీ వేడుకలకు హాజరు కాలేదు. 2017లో స్వామి వారికి సీఎం మనుమడితో పట్టువస్త్రాలు పంపించడమూ, విమర్శలకు దారితీయడమూ తెలిసిందే. కోవిడ్‌ నేపథ్యంలో రెండేళ్లపాటు అంతరాలయంలోనే సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిపారు. భక్తులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాకపోయినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కల్యాణ ముహూర్తం ప్రకటించినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ రాకపై చర్చ సాగుతోంది. నిజాం నవాబు తానీషా కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న పట్టు వస్త్రాలు, తలంబ్రాల సమర్పణను ముఖ్యమంత్రి హోదాలో బ్రేక్‌ చేసిన కేసీఆర్‌.. ఈ సారైనా వస్తారా?  రారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. 

యాదాద్రి పూర్తైంది.. మరి భద్రాద్రి..? 
2016న భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్‌ భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయితో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. అంతటితో ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అదే క్రమంలో యాదాద్రి ఆలయాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. వందల కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు.  యాదాద్రితో పాటే భద్రాద్రి అని అధికారం పక్షం వారు చెబుతున్నా.. అభివృద్ధి అమలుకు నోచుకోవడంలేదు. యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తైన నేపథ్యంలో భద్రాచలం రామాలయంపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టాలని భక్తులు, జిల్లావాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. 

స్థానికులు, భక్తుల్లో అసంతృప్తి
భద్రాచల రాముడిపై సీఎం కేసీఆర్‌కు చిన్నచూపు ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శల దాడి చేస్తున్నాయి. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భద్రాచలం రామాలయం అభివృద్ధి చేయకపోవడం, ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి సాధించలేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ పథకంలో భాగంగా భద్రాచలం, పర్ణశాల ఆలయాలకు రూ.96 కోట్లు ప్రకటించింది. కార్యాచరణ వేగవంతం చేసింది. కల్యాణానికి ముఖ్యమంత్రి, పట్టాభిషేకానికి గవర్నర్‌లు హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ హాజరు కాకుండా, గవర్నర్‌ తమిళిసైతో పాటుగా బీజేపీ మంత్రులు హాజరయితే విమర్శల తాకిడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

ఉగాది రోజు సీఎం, గవర్నర్‌కు ఆహ్వానాలు
శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరు కావాలని దేవస్థానం తరఫున సీఎం, గవర్నర్‌లకు ఉగాది రోజున ఆహ్వాన పత్రికలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా ఏప్రిల్‌ 2న సీఎం, గవర్నర్‌లను ఆహ్వానించేందుకు ఈవో, అర్చకులు వెళ్లనున్నారు. 1న దేవదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం, గవర్నర్‌తోపాటు ఇతర మంత్రులను ఆహ్వానించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement