హన్మకొండ: అసెంబ్లీ ఎన్నికలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. స్వగ్రామంలో ఓటు వేసి తిరిగి వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇద్దరు కుమారుల కాళ్లు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన వాంకుడోత్ రవీందర్ తన కుటుంబంతో కలిసి హనుమకొండ రెడ్డికాలనీలో నివాసముంటున్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుని బైక్ పై భార్య మానస(27), ఇద్దరు కుమారులు జ్ఞాన చైతన్య, హర్షవర్ధన్‌ను తీసుకుని హనుమకొండకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో వరంగల్–నర్సంపేట రహదారిపై గీసుకొండ మండలం కొమ్మాల శివారులోకి రాగానే నర్సంపేట వైపునకు ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో రవీందర్, మానసకు బలమైన గాయాలు కాగా వారి కుమారుల కాళ్లు విరిగాయి. వారందరినీ 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కోసం మానసను హనుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్‌పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, మృతురాలి బంధువు వాంకుడోత్ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment