
నారాయణఖేడ్: తన కూతురుతో వివాహితుడైన యువకుడు చనువుగా ఉండటాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. కూతురుతో ఫోన్ చేయించి రప్పించి, అతడిని అత్యంత దారుణంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలుముక్క లుగా చేసి తగులబెట్టాడు. తర్వాత తానే హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు. సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట మండలం నాగ్‌ధర్ పరిధిలోని రాంచందర్ తండాకు చెందిన ఆంగోతు దశరథ్ (26) సంగారెడ్డి సమీపంలోని ఓ చక్కెర కర్మాగారంలో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దశరథ్ గతంలో ట్రాక్టర్ నడిపిన సమయంలో పరిచయమైన నిజాంపేట మండలం మేగ్యానాయక్ తండాకు చెందిన నేనావత్ గోపాల్ కూతురు (14 ఏళ్లు)తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. బాలిక ఉండే హాస్టల్‌వద్దకు సైతం తరచూ వెళ్లి వచ్చే వాడని తెలిసింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేపోయిన బాలిక తండ్రి గోపాల్.. ఈ నెల 12వ తేదీన తన కూతురుతోనే ఫోన్ చేయించి దశరథ్‌ను రప్పించాడు.
అతడిని మభ్యపెట్టి ఈదుల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గుట్టలమధ్య దారుణంగా హత్య చేశాడు. తర్వాత దశరథ్ శవాన్ని బండరాళ్లతో కొట్టి కాళ్లు, చేతులు, ముక్కలుముక్కలుగా నరికి కాల్చివేశాడు. ఇదిలా ఉండగా పని ఉందంటూ బయటకు వెళ్లిన తన భర్త అటు స్వస్థలమైన రాంచందర్ తండాలోని ఇంటికి వెళ్లక.. ఇటు సంగారెడ్డిలోని తాము ఉంటున్న ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన దశరథ్ భార్య సోని ఈనెల 14న తన భర్త అదృశ్యమైనట్లు సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దశరథ్ జాడ తెలియక ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలోనే అతడిని తానే హత్య చేసినట్లు ఒప్పుకుని గోపాల్, నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం లొంగిపోయాడు. పోలీసులు విచారించగా, ఆదివారం ఈదుల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో గుట్టలమధ్య హత్యచేసిన ప్రదేశాన్ని చూపించాడు. పోలీసులు దశరథ్ మృతదేహం అవశేషాలను స్వాధీనం చేసుకొని, వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment