వైఎస్ షర్మిలకు విజయమ్మ ఆత్మీయ ఆలింగనం
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ఇకపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజన్న తరహా సంక్షేమ పాలన కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా తమ పార్టీ ముందుకుసాగుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ‘రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ’కు తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వచ్చిన వైఎస్ షర్మిల తొలుత సభా ప్రాంగణంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
అభివృద్ధి ఫలాలన్నీ ఆ కుటుంబానికే..
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్‌ను తిరిగి ప్రతిష్టించేందుకు పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదన్నారు. విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు లేవని విమర్శించారు. నీళ్లు, నిధులు, ని యామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ లో అభివృధ్ధి ఫలాలన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయ్యాయని, వారి కుటుంబమే లబ్ధి పొందుతోందని ఆరోపించారు. పదవులన్నీ బంధు వర్గానికి, భజన బ్యాచుకే కట్టబెడుతున్నారన్నారు.
శుక్రవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభకు హాజరైన జనం
బంగారు తెలంగాణ ఎక్కడుంది?
ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడుందని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం అంతా కేసీఆర్ దొరగారి ఎడమ కాలిచెప్పు కింద పడి నలిగిపోతోందని విమర్శించారు. దేశంలో సచివాలయానికి రాని ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీ డిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి అవినీతికి పాల్పడ్డారని, దీన్ని ప్రశ్నించేందుకు ఒక పార్టీ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్..నేను ఏడ్చినట్లు చేస్తా’అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై కొత్త పార్టీతో వస్తున్నా..’అని అన్నారు.
దారి పొడవునా ఘనస్వాగతం
షర్మిలకు హైదరాబాద్ నుంచి ఖమ్మం పట్టణం వరకు దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. లోటస్ పాండ్ నుంచే షర్మిల వాహనం వెంబడి వందలాది వాహనాలు అనుసరించాయి. పలుచోట్ల నేతలు, అభిమానులు పూలు, హారతులు, బోనాలతో షర్మిలకు స్వాగతం పలికారు.
15 నుంచి హైదరాబాద్‌లో నిరాహార దీక్ష
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో రిలేదీక్షలు చేస్తారని తెలిపారు.
నా బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ
వైఎస్సార్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన రోజునే షర్మిల తన రాజకీయ అడుగులు మొదలు పెడుతున్నారని వైఎస్ విజయమ్మ తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలంటూ, ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. షర్మిల స్వభావం పూర్తిగా వైఎస్ రక్తం నుంచే వచ్చిందని, వైఎస్ మాదిరే షర్మిల సైతం మంచి పాలన అందిస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల గతంలో తెలంగాణలో చేసిన ప్రతి యాత్రలో ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటుందని అన్నారు. వైఎస్‌ను గతంలో తెలంగాణ ప్రజలు ఆదరించారని, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటామని తెలిపారు. వైఎస్ భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చానని విజయమ్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment