
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలవనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4గంటలకు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర మంగళవారానికి వాయిదా పడినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 9 (మంగళవారం) నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారని వెల్లడించాయి.
‘నీతి ఆయోగ్’ బహిష్కరణపై షర్మిల ఆగ్రహం
నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం కేసీఅర్ బహిష్కరించడంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడగాల్సిన చోటుకు అలిగి పోకుండా ఉంటే ఆగం అయితం దొరా’ అంటూ సీఎంను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానికి ఎదురుపడలేక ఏతులు కొడితే తెలంగాణ కడుపెండుతదని, మూర్ఖ రాజకీయాలతో రాష్ట్రాన్ని తగలపెట్టొద్దంటూ హితవు పలికారు.